కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో జలాశయం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల, సుంకేశుల నుంచి ప్రాజెక్టుకు 1,73,695 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.85 అడుగుల నీరుంది.
జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.36 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. స్పిల్ వే ద్వారా సాగర్‌కు 1,73,695 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
విద్యుత్ ఉత్పత్తి ద్వారా 63,046 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తడంతో శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు జలాశయం అందాలను తిలకిస్తున్నారు.