జిల్లాలో ఆరు వారాల నుంచి సంచరిస్తూ, అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ముప్పుతిప్పులు పెడుతున్న పెద్దపులిని బంధించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద బోనును జిల్లాకు తెప్పించారు. దీనిని బుధవారం కె.కోటపాడు మండలం చౌడువాడలో ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో నుంచి జూన్ చివరి వారంలో అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి.. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, మాడుగల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సంచరిస్తూ, పశువులపై పంజా విసురుతున్న సంగతి తెలిసింది. వివిధ ప్రాంతాల్లో పదికిపైగా ఆవులు, గేదెలు, మేకలను హతమార్చింది. పులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటుచేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
అయితే ఈ బోన్లు చాలా చిన్నవిగా వుండడంతో పెద్దపులి బోను సమీపంలోకి వస్తున్నప్పటికీ, లోపలికి వెళ్లడంలేదు. మరోవైపు పశువులపై పులి దాడులు పెరిగిపోతుండడంతో రైతులు తీవ్రభయాందోళన చెందుతున్నారు. పెద్దపులిని త్వరగా బంధించాలని, లేకపోతే మనుషులపైనా దాడి చేసే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దబోనును తెప్పించారు. దీనిని కె.కోటపాడు మండలం చౌడువాడ సమీపంలోని నల్లగొండ అటవీ ప్రాంతంలో ఇటీవల పశువులపై దాడి చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు.