ఏదైనా చేసేముందు ఆలోచించి చేస్తే...ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యవహరిస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఇదిలావుంటే మయాంక్ అనే 25 ఏళ్ల యువకుడు.. రోడ్డుపై వెళుతూ ఓ ఇంటి గోడ వద్ద మూత్రం పోశాడు. అది చూసిన ఆ ఇంటి మహిళ మయాంక్ ను తప్పుపట్టింది. తాను పెద్ద తప్పేం చేశానంటూ మయాంక్ తిరిగి వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అదే సమయంలో మహిళ కుమారుడు మనీష్ అక్కడికి వచ్చాడు. వారి మధ్య గొడవ జరిగింది. మనీష్ పై మయాంక్ చేయి చేసుకున్నాడు.
అంతటితో ఆగకుండా తన స్నేహితులు ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించాడు. నలుగురూ కలిసి మయాంక్ వెంట పడ్డారు. ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలోని డీడీఏ మార్కెట్ సమీపంలో మయాంక్ ను పట్టుకున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచేసి పారిపోయారు. మయాంక్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే చనిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటన వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మనీష్ తోపాటు అతడి స్నేహితులు రాహుల్, ఆశిష్, సూరజ్ లను అరెస్టు చేసినట్టు ప్రకటించారు.