కొంత కాలంగా రానా ఆరోగ్యపరిస్థితి బాగోలేదని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రానా ఖండించినా అతని లుక్ చూసిన వాళ్లు మాత్రం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రానా తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. చివరగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కనిపించిన రానా కొంతకాలంగా షూటింగ్‌లకు కూడా దూరంగా ఉంటున్నాడు. అయితే చాలా రోజుల తరువాత ఈ యంగ్ హీరో ఇండియాకు తిరిగి వస్తున్నాడు. ఈ విషయాన్ని రానా స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించాడు. మరో 72 గంటల్లో భారత్‌లో అడుగుపెట్టబోతున్నాను అంటూ గురువారం ఉదయం ట్వీట్ చేశాడు రానా. ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న బైలింగ్యువల్ సినిమా హాథీ మేరి సాథీ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అంతేకాదు నీది నాది ఒకే కథ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం పేరుతో ఓ పీరియాడిక్ సినిమాను కూడా ప్రారంభించాడు రానా. ఈ రెండు సినిమాలే కాక మరికొన్ని సినిమాలు చర్చల దశలో, ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే రానా విదేశాలకు వెళ్లిపోయాడు. ఎందుకు వెళ్లాడన్న విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను మాత్రం ఖండించాడు. అంతేకాదు పదే పదే అవే వార్తలు వస్తుండటంతో కొంత అసహనం కూడా వ్యక్తం చేశాడు. అయితే చాలా కాలం తరువాత రానా ఇండియాకు తిరిగి వస్తుండటంతో మీడియా కూడా రానా గుర్తించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రానా అభిమానుల కోసం మీడియా సమావేశం ఏమైనా ఏర్పాటు చేస్తాడా..? లేక సైలెంట్‌గా షూటింగ్ పనులు మొదలు పెట్టేస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. బాలీవుడ్‌లోనూ రానా రాకకోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న బాలీవుడ్ మూవీ హౌజ్‌ఫుల్ 4లో రానా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ రానా పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమోషన్‌కు హాజరైతే హెల్త్ ఇష్యూకు సంబంధించిన ప్రశ్నలు తప్పని సరిగా ఎదురవుతాయి. వాటిపై రానా ఎలా స్పందిస్తాడన్న విషయం తెలుసుకునేందుకు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa