మెగాస్టార్ చిరంజీవిని ఆచార్య ఫలితం బాగా కుంగదీసినట్టుంది. ఈ సినిమాతో కెరీర్లో ఎప్పుడూ లేనివిధంగా చిరు నటనపరంగా విమర్శలనెదుర్కున్నాడు. దీంతో తన షెడ్యూల్ లో భారీ మార్పులు చేసినట్టు తెలుస్తుంది. వెకేషన్ నుండి తిరిగొచ్చిన చిరు ముందుగా చివరిదశలో ఉన్న గాడ్ ఫాదర్ షూటింగును పూర్తి చెయ్యాల్సి ఉంది. ఆపై వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలను చెయ్యాల్సి ఉంది. ఈ మూడు సినిమాలలో గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు మలయాళ , తమిళ హిట్ చిత్రాలైన లూసిఫర్, వేదాళం లకు రీమేకైతే వాల్తేరు వీరయ్య డైరెక్ట్ తెలుగు సినిమా. ఆచార్య పరాభవంతో, తీవ్ర అసంతృప్తికి గురైన చిరు తిరిగి ప్రేక్షకులను రీమేక్ సినిమాతో పలకరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో? హిట్ టాక్ తెచ్చుకుంటే ఓకే... లేకపోతే తిరిగి ట్రోలింగ్స్ కు గురి కావాల్సి ఉంటుందని ఆలోచించి బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాడట. ఈ చిత్రంలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నారని సమాచారం. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాలరిగా, ఊరమాస్ అవతారంలో కనిపించి మెగా అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో చిరు కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో భారీ డిజాస్టర్ ను చవిచూసిన చిరుకు బాబీ సూపర్ హిట్ నివ్వగలడా? చూడాలి..