క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న రవితేజ ఖిలాడీ సినిమాతో భారీ ఫ్లాప్ ను చవిచూశాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వరసగా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. రామారావు ఆన్ డ్యూటీ, ధమాఖా, టైగర్ నాగేశ్వరరావు సినిమాల వరస షూటింగులతో రవితేజ చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ రాత్రి పూట చెమట చిందిస్తున్నాడు. ఎందుకంటే, టైగర్ నాగేశ్వరరావు దొంగతనాల నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి రాత్రిళ్ళు షూట్ చెయ్యాలి. ఇందుకోసం టైగర్ నాగేశ్వరావు చిత్రబృందం బాగా కష్టపడుతుంది. షూట్ లొకేషన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సెట్ ను ఏర్పాటు చేసేందుకు సభ్యులు ఎంతగా కష్టపడుతున్నారో కనబడుతుంది.
వంశీ డైరెక్షన్లో రవితేజ నటించనున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందనుంది. 1970లలో దేశవ్యాప్తంగా పేరుమోసిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో కెరీర్లోనే తొలిసారిగా బాలీవుడ్ ను పలకరించబోతున్నాడు రవితేజ. ఇంకా పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా పరిచయమవబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు ఆడిపాడనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.