1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1975లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం ఎరుగక సినిమాలు చేయడం ప్రారంభించాడు. సినిమాలు విజయవంతం అవుతున్నా అప్పటివరకు నటునిగానే ఉన్నానని భావించిన కృష్ణ తనకు స్టార్‌డం తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి 1970లో తన స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ప్రారంభించాడు.