సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్‌సలామ్. లైకా ప్రోడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో విష్ణు విశాల్, అనంతిక సనీల్‌కుమార్, ధన్య బాలకృష్ణ, జీవిత రాజశేఖర్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఓ అతిథి పాత్రలో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కనిపించనున్నాడు. ఆస్కార్ గ్రహీత రెహమాన్ సంగీతం అందించగా ఫిబ్రవరి 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి ఆదరణ లభించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలాఉండగా ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లు భారీగా చేస్తు సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మరోమారు వార్తల్లోకెక్కింది. షూటింగ్ దశ నుంచే వివాదాల్లో కూరుకుపోయిన ఈ చిత్రం టీజర్ విడుదల నాటి నుంచి ఏదో రకంగా వార్తల్లో ప్రథమంగా నిలుస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమాపై అరబ్ దేశాలు నిషేధం విధించాయి. ఈ సినిమా మత పర విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నదంటు చిత్రంపై బ్యాన్ విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కాధల్ ది కోర్ సినిమాపై ఇలానే బ్యాన్ విధించిన అరబ్ దేశాలు ఇటీవల పక్షం రోజుల క్రింద విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాను సైతం నిషేధం విధించడం విశేషం. తాజాగా ఇప్పుడు లాల్ సలామ్ కూడా ఈ లిస్టులో చేరింది. నిన్న మొన్నటివరకు నటీనటులపై తమిళనాట బాగా రాద్ధాంతం అవడం, రజనీకాంత్, ఐశ్వర్య ప్రసంగాలు పెద్ద రచ్చే చేయగా ఇప్పుడు ఈ నిషేధం సినిమా వసూళ్లపై భారీగానే పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.