విలక్షణతకు మారుపేరు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. వయస్సు పెరుగుతున్న కొద్ది తనలోని ప్రత్యేకతను, కళపై తనకున్న జిజ్ఞాసను తెలియజేస్తు తను ఎంత భిన్నమో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఓ వైపు తన కుమారుడు దుల్కర్ సల్మాన్ వరుస చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకుంటుండగా.. దేశంలో మరో నటుడు చేయడానికి భయపడే కథలను ఎంపిక చేసుకుంటూ మమ్ముట్టి తోటి వారికి సవాల్ విసురుతున్నారు. ఇందుకు ముఖ్య ఉదాహరణ ఇటీవలే ఆయన ‘కాథల్: ది కోర్’ సినిమాలో ‘గే’ పాత్రలో నటించి విమర్శకులను సైతం నోరెళ్లబెట్టేలా చేశారు. ఇదిలాఉండగా ఆయన మరోసారి వినూత్న ప్రయోగం చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ముగిసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలాన్ని మరోసారి తెరమీదకు తీసుకు వచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా తను నటించిన ‘భ్రమయుగం’ చిత్రం బ్లాక్ అండ్ వైట్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 139 నిమిషాల (రెండు గంటల 19 నిమిషాల) నిడివితో.. ఫిబ్రవరి15న పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.