క్రియేటివ్ డైరెక్టర్ గుణ శేఖర్ ఇటీవల శాకుంతలం సినిమా తర్వాత తెరకెక్కించిన చిత్రం యుపోరియా. తన కుటుంబ సభ్యులే నిర్మాతగా వ్యవహరించగా స్వయంగా తయారు చేసుకున్న కథకు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం చేస్తున్నారు. తన ఒక్కడు సినిమా కథానాయిక భూమిక లీడ్ రోల్‌లో నటిస్తుండగా మిగతా అంతా కొత్త వారితో ఈ సినిమాను రూపొందించారు. విక్రమ్ నాన్న, పొన్నియన్ సెల్వన్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన సారా అర్జున్, నాజర్, రోహిత్, ఆదర్శ్, లిఖిత, పృథ్వీరాజ్, సాయి శ్రీనిఖ, విజ్ఞేష్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతం అందించారు.
తాజాగా ఈ వరల్డ్ ఆఫ్ యూపోరియా అంటూ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే గుణ శేఖర్ ఏదో కొత్తగా,పెద్దగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ చాలా రోజుల తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించేలా కనిపిస్తోంది. ఈ తరానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో డ్రగ్స్, అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలు వంటి సీరియస్, థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌తో ఈ సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చూడాలి ఈ సినిమాతో అయినా దశాబ్దంగా ఎదురుచూస్తున్న విజయం గుణశేఖర్ కు దక్కుతుందో లేదో. ఇదిలాఉండగా ఇటీవల తెలుగు సినిమాల్లో డ్రగ్స్ సన్నివేశాలపై తెలంగాణా నార్కోటిక్ పోలీసులు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బేబీ సినిమాతో పాటు.. సాయిధరమ్ తేజ్ గాంజా శంకర్ చిత్ర టైటిల్ పైనా అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ క్రమంలో గతంలో నార్కోటిక్ పోలీసుల వార్నింగ్ కు ఈ యూపోరియా సినిమా కూడా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది కానీ నేడు గుణశేఖర్ తీస్తోన్న యుఫోరియా చిత్ర గ్లింప్స్ లో ఓపెనింగ్ షాట్‌లోనే యువతి డ్రగ్స్ పీల్చే సన్నివేశం పెట్టారు. ఇంటెన్స్ గా తీసిన ఆ సన్నివేశాన్ని చూస్తే.. ఖచ్చితంగా పోలీసులు మరోమారు అభ్యంతరాలను లేవనెత్తుతారెమో అన్నట్టుగా ఉంది.