అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో పాటు చివరి పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మూడేళ్ల క్రితం ఇదే కాంబినేషన్‌లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న 'పుష్ప' ది రైజ్ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకతో 'పుష్ప-2' మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇండియా మొత్తం మాసివ్ 'పుష్ప-2' ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడంతో పాటు, మూడు లక్షలకు పైగా జనసంద్రంతో జరిగిన ట్రైలర్ వేడుకను చూసి అందరూ విస్మయానికి గురయ్యారు. ఇక ఈ ఆదివారం చెన్నయ్‌లో ఈ సినిమాకు సంబంధించిన మరో ఈవెంట్ జరగబోతుంది. ఈ పబ్లిక్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్, శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెమ్‌సాంగ్ 'కిస్సిక్'ను విడుదల చేస్తున్నారు. ఇక వసూళ్ల పరంగా పుష్ప-2 ముందస్తుగానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా యూఎస్‌ఏలో బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో 'పుష్ప-2' వసూళ్ల వేట మొదలైంది. సినిమా విడుదలకు పన్నెండు రోజుల ముందే ఈ చిత్రం ప్రీసేల్స్‌లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇప్పటి వరకు యూఎస్‌ఏలో 45 వేల టిక్కెట్స్‌పైగా సేల్స్ సాధించి 1.25 మిలియన్ డాలర్స్ మార్క్ కలెక్షన్‌ను టచ్ చేసింది. ఇది ఇండియన్ సినిమా నుంచి ఆల్‌టైమ్ ఫాస్టెస్ట్ వసూళ్లుగా యూఎస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో 'పుష్ప-2' ఇక్కడ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.