హైదరాబాద్: నటుడు నాగచైతన్య - నటి శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.తాజాగా ఈ జంటకు హల్దీ వేడుక జరిగింది. కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి ఈ వేడుక నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ జంటకు మంగళస్నానాలు చేయించి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.డిసెంబర్ 4న చైతన్య - శోభిత వివాహం జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారు. దీని గురించి ఇటీవల చైతన్య మాట్లాడారు. శోభితతో జీవితాన్ని పంచుకునేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ''మా పెళ్లి చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావు లేదు. ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. తనతో నేనెంతగానో కనెక్ట్ అయ్యా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నా'' అని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు