తక్కువ సమయంలో రూ. 1700 కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రంగా 'పుష్ప 2' (Pushpa 2) రికార్డు నెలకొల్పింది. 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగానూ 'పుష్ప 2' టాప్‌లో ఉంది. ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా, హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 5న బాక్సాఫీసు ముందుకొచ్చింది.హిందీలోనే రూ. 700 కోట్లకుపైగా (నెట్) కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కొన్ని రోజుల నుంచి అక్కడ త్రీడీ వెర్షన్‌లోనూ ప్రదర్శితమవుతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఉన్న కేజీయఫ్ 2 (రూ.1250 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (దాదాపు రూ.1300 కోట్లు)ను దాటేసిన 'పుష్ప 2'.. 'బాహుబలి 2' (రూ.1810)ని బీట్ చేసే దిశగా వెళ్తోంది.వసూళ్ల హవా కొనసాగిస్తున్న 'పుష్ప 2' ఓటీటీకి (Pushpa 2 OTT) వచ్చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఇటీవల వార్తలు ట్రెండ్ అయ్యాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ చర్చ సాగింది. ఆ వార్తలపై చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ కాదని స్పష్టం చేసింది.