గంటల వ్యవధిలోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతుల ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. మహారాష్ట్ర నుంచి కుమురం భీం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు హడలెత్తిస్తోంది. ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఈ గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మూడేళ్ల కిందట సైతం ఇదే ప్రాంతంలో పులి పంజాకు ఇద్దరు యువకులు బలయ్యారు. నవంబరు 2021లో కొండపల్లి గ్రామ శివారు ప్రాంతంలోనే నిర్మల అనే యువతి పులి దాడిలో చనిపోగా, తాజాగా ఇదే గ్రామంలో ఓ రైతు ఏనుగు దాడిలో దుర్మరణం చెందాడు. ప్రస్తుతం ఏనుగు సంచరిస్తున్న అటవీ ప్రాంతం, సమీప గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.
ఏనుగు జాడ కోసం అధికారులు గాలింపు కొనసాగుతుండగా.. సులుగు పల్లి - ముంజం పల్లి మధ్యలో ఉన్నట్టు గుర్తించారు. ప్రాణహిత ప్రాజెక్టు కాల్వ గుండా ఏనుగు ప్రయాణం సాగిస్తున్నట్టు తెలుసుకున్నారు. బెజ్జూరు, చింతల మానేపల్లి, పెంచికల్ పేట, దహెగాం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏనుగును బంధించడం అసాధ్యమని, తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపిస్తామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.
వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మోహన చంద్ర పర్గేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అసలు ఈ ప్రాంతంలోకి ఏనుగు వస్తుందని ఊహించలేదని, గతంలో ఎప్పుడూ తెలంగాణలోకి గజరాజులు వచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. దాడిచేసిన ఏనుగు కదలికలను డ్రోన్‌ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర, ఛత్తిస్‌గడ్, తమిళనాడు అధికారుల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. మళ్లీ ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఏనుగు మహారాష్ట్రకు వెళ్లే వరకు సహకరించాలని ప్రజలను ఆయన కోరారు.
సరిహద్దుల్లోని చింతలమానేపల్లి, పెంచికలపేట, బెజ్జూరు తదితర మండలాలకు చెందిన ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏనుగు భీభత్సం సృష్టించి ఇద్దర్ని చంపేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మనుషులపై పులులు దాడి చేసి హత మార్చిన ఘటనలు చూశాం. కానీ మొట్టమొదటిసారిగా ఏనుగు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన రైతు అల్లూరి శంకర్(56)ను బుధవారం సాయంత్రం తొక్కి చంపింది. ఈ ఘటన జరిగి 24గంటలైన గడకముందే పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతు కారు పోశయ్య(57)పై ఒక్కసారిగా దాడి చేసి హతమార్చింది.
దాడిచేసిన ఏనుగు వయసు సుమారు 25-30ఏళ్లు ఉండవచ్చని అధికారులు చెప్పారు. ఏనుగు ఆచూకీ కోసం 30 మందిని ట్రాకింగ్, అటవీ సమీప గ్రామంలో ఇద్దరి చొప్పున సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో దానికి నీటి వసతి ఉన్నా ఆహారం దొరకదని అటవీ అధికారులు చెప్పారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి.. బెజ్జూరు, పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి మండలాల్లో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa