తొలి తెలుగు యాంకర్, న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే.. వార్తలు, సమాచారం, ‘జాబులు- జవాబులు’, ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్.. ప్రస్తుత తరం యాంకర్లకు ఆయనే గురువు అంటే అతిశయోక్తి కాదు.
తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంతిస్వరూప్. 1978లో ఆయన దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు. 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ఆయనకే అవకాశం దక్కింది. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి... ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు.
ఎదురుగా స్క్రీన్‌పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందుకే విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవారు శాంతిస్వరూప్. ఆయన వార్తలు చదువుతుంటే ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగా, తోటివారికి చెబుతున్నట్లుగానో ఉండేది. ఇదే తెలుగువారిలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. తెలుగు దూరదర్శన్‌లో మొట్టమొదటి యాంకర్, న్యూస్ రీడర్ కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావనకు వస్తే శాంతిస్వరూప్ టక్కున గుర్తుకొస్తారు. ఆయన జనవరి 7, 2011 జనవరి వరకు దూరదర్శన్‌లో ఉన్నారు. బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త..? సంతోషకరమైన వార్త ఏది అని ఆయనను ఓసారి ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు.
మొదటి విషాదకరమైన వార్త ప్రధాని ఇందిరాగాంధీ మరణం.. ఇందిరాగాంధీ మరణించారని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 16 బుల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి ఆమె మరణం ఒక సంచలనం అని అన్నారు. రెండో వార్త ఏది అని అడగితే. ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త చెప్పారు. ఇందిరాగాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణము చాలా దారుణమని.. ఆయన శరీరం ముక్కలు ముక్కలూ అయిందని అందుకే ఆ వార్త ఇప్పటికీ నాకు గుర్తుండి పోయిందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి షా కమిషన్ కి సంబంధించిన పది పేజీలఇంగ్లీషు రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవారు. ఇది తనకు మధుర జ్ఞాపకాల్లో ఒకటని చెప్పేవారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa