ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. మద్యం ధరలు భారీగా పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 16, 2024, 07:27 PM

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. కావాల్సిన బ్రాండ్లు బీర్లు దొరకక మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు మద్యం ధరలు పెంచేందుకు సర్కారు యోచిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. అయితే.. తక్షణమే మద్యం ధరలు పెంచుతారా లేదా.. కొన్ని రోజుల తర్వాత పెంచుతారన్నది స్పష్టత లేదు కానీ.. పెంచటమైతే పక్కా అన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభనష్టాలపై సర్కారు బేరీజు వేస్తున్నట్టు సమాచారం.


సాధారణంగా.. రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతుంటారు. రెండేళ్ల క్రితం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం ధరలకను పెంచగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంతు వచ్చింది. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే సర్కారు మీద విమర్శలు వస్తాయనే కోణంలో.. ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.


ప్రభుత్వం ఎప్పుడు మద్యం రేట్లు పెంచినా.. ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల లిక్కర్ ధరల మీద 20 నుంచి 25 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇలా గనక ధరలు పెంచితే ఏటా సర్కారుకు అదనంగా రూ.3 వేల నుంచి మూడున్నర వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. 2022 మార్చిలో బీఆర్ఎస్ సర్కార్.. లిక్కర్ రేట్లను పెంచింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ధరలను సవరించాల్సి ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తవటంతో... ఇప్పుడు ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం.


  ఇక.. సర్కారుకు వస్తున్న ఆదాయ వనరుల్లో మద్యం అమ్మకాలే ప్రధానం. కాగా.. మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.37 వేల కోట్ల వరకు సర్కారుకు ఆదాయం సమకూరుతుంది. అయితే.. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గం ఉపసంఘం ఇటీవలే సమావేశం నిర్వహించింది. ఏయే శాఖల నుంచి అదనంగా నిధుల సమీకరణ చేయొచ్చని చర్చ జరిగిందని, అందులోనే లిక్కర్ రేట్ల పెంపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.


అయితే.. పక్క రాష్ట్రమైన ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం కొన్ని లిక్కర్ బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దీంతో.. ఏపీ ప్రజలు, తెలంగాణ సరిహద్దు జిల్లాలకు వచ్చి మరీ.. తమకు కావాల్సిన బ్రాండ్లకు కొనుగోలు చేసేవారు. ఫలితంగా ఆ ప్రాంత మద్యం దుకాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ.. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారటంతో లిక్కర్ పాలసీ కూడా మారుతుందని.. అన్ని బ్రాండ్ల లిక్కర్ విక్రయాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఏపీ పాలసీని కూడా దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను పెంచే అవకాశం ఉంటుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa