తెలంగాణలో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి సర్కారుకు తెలంగాణ ప్రజానీకం అధికారం కట్టబెట్టింది. కాగా.. ప్రజారాజ్యంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ (Telangana Congress) ప్రభుత్వంపై కూడా మెల్లగా వ్యతిరేకత మొదలైంది. ముఖ్యగా.. నిరుద్యోగ యువత నుంచి ఈ వ్యతిరేకత ప్రారంభమైంది. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ.. ఇప్పటికే యువత ఆందోళనలు మొదలుపెట్టింది. మోతీలాల్ నాయక్ అనే నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేయగా.. ఆయనకు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత.. ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. యాదాద్రి భువనగిరిలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు నిరసన సెగ తగిలింది. తీన్మార్ మల్లన్నను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్‌ల మీద స్పందించాలంటూ మల్లన్నను డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే.. సమావేశానికి వెళ్తున్న మల్లన్నను పిలిచిన బీజేవైఎం కార్యకర్తలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటమే కాకుండా.. ఆయనను మాట్లాడుకుండా చేశారు.
అయితే.. నిరుద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని మల్లన్న వారికి హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని మాట ఇచ్చారు. అయినప్పటికీ మల్లన్నను బీజేవైఎం కార్యకర్తలు ఆయన మాటలను లెక్క చేయకుండా.. తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో.. "మీరు రమ్మని పిలిస్తేనే వచ్చానని.. వచ్చాన నా మాట వినకుండా ఇలా నినాదాలు చేయటం నన్ను అవమానించటమే అవుతుంది.." అంటూ మల్లన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో.. పోలీసులు కల్పించుకుని.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎంతకు వినకపోవటంతో.. తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa