రాఖీ పౌర్ణమి రోజున గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ చిన్నారి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే.. కండక్టర్‌తో పాటు డెలివరీకి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ గవర్నమెంట్ హాస్పటల్ స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్‌ను సంస్థ అందించింది.
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న గద్వాల డిపోనకు చెందిన కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతో పాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్‌లో మంగళవారం (ఆగస్టు 20వ తేదీన) టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి.. నగదు బహుమతులు అందజేశారు. అనంతరం.. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్‌ను నర్సు అలివేలు మంగమ్మకు, చిన్నారి ఉచిత బస్ పాస్‌ను గద్వాల డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందజేశారు.
ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడుపోసిన కండక్టర్.. సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్
గద్వాల- వనపర్తి మార్గంలో నడిచే పల్లె వెలుగు బస్సులో రాఖీ పండుగ రోజున సోమవారం (ఆగస్టు 19వ తేదీన) ఉదయం సంధ్య అనే గర్భిణి.. తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తోంది. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే సంధ్యకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి.. బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు అలివేలు మంగమ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు సంధ్య జన్మనిచ్చింది. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ భారతి, నర్సు అలివేలు మంగమ్మ, డ్రైవర్ అంజి సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని సజ్జనార్ ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa