రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలతో జన జీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వేల ఇండ్లు నీట మునిగిపోవటంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. విజయవాడ, ఖమ్మం జిల్లాల్లో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక భారీ వరదలకు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలే కాదు కోటీశ్వర్లు కూడా వరద బాధితులుగా మారి రోడ్డున పడ్డారు. కోట్లు, ఖర్చు చేసి ఖరీదైన, విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన వారు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి పేద,ధనిక తేడా లేదనటానికి ఈ ఘటనే ఉదాహరణ అని పలువురు పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.
గత రెండ్రోలుజు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ శివారు శంకర్‌పల్లి మండలం మోకీల పరిధిలోని పలు విల్లాలు నీట మునిగాయి. లా పలోమా విల్లాస్ కమ్యూనిటీలోకి భారీగా వరద నీరు పోటెత్తింది. అక్కడ సుమారు 210 విల్లాలు ఉండగా.. అవన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విల్లాల పక్కన ఉన్నే వాగు పొంగి ప్రవహించింది. దానికి తోడు చుట్టూ కొత్తగా నిర్మించిన పలు కమ్యూనిటీ విల్లాస్‌లో నీటి వ్యవస్థలు సక్రమంగా నిర్వహించకపోవటంతో వరద నీరు విల్లాల్లోకి చేరింది.
దీంతో రూ. కోట్లు విలువ చేసిన కొనుగోలు చేసిన విల్లాల్లోకి నీరు చేరింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వరద చేరటంతో ఖరీదైన సోఫాలు, ఇంటి సామగ్రి తడిసిపోయాయి. లక్షల ఖరీదైన కార్లు నీట మునిగాయి. చెరువును తలపిస్తూ కమ్యూనిటీ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. బయట పరిస్థితిని చూసిన పలువురు విల్లావాసులు లబోదిబోమని నెత్తినోరూ బాదుకుంటున్నారు. తాగటానికి మంచినీరు కూడా లేదని.. పాలు, నిత్యవసర సరుకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కోట్లు పెట్టి విల్లాలు కొనుగోలు చేసి ఇప్పుడు రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కాలువలు, చెరువులు కబ్జా చేసి విల్లాలు నిర్మించటం వల్లే వరద పోటెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న చెరువులలోకి వెళ్లాల్సిన వరద నీటిని దారి మళ్లించటంతోనే విల్లాలు నీట మునిగాయని అంటున్నారు. వీటిపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీంతో హైడ్రా వీటిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa