ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:05 PM

తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సిందీపోయి..ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు.. సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేధనను పరిగణనలోకి తీసుకోకుండా.. కేబినెట్ సమావేశంలో హైడ్రాకు అధికారాలు కట్టబెట్టడం అన్యాయమన్నారు.హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో జరుపుతున్న కూల్చివేతలపై పునరాలోచన చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసి, పేదలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. సాధారణంగా.. ప్రభుత్వాలేవైనా నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాయి. చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం, ప్రజలకు ఉపయోగపడే ఇతర నిర్మాణాలపై దృష్టి సారించి ప్రజలకు మేలుచేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ, రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా.. కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీస ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్.. నిర్మాణాత్మక ఆలోచనలకు, ప్రజోపయోగ మౌలికవసతుల నిర్మాణానికి డబ్బుల్లేవన్న కారణాలు చూపుతోందన్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో.. అక్రమ కట్టడాల పేరిట ఇండ్లను కూల్చివేసే మార్గాన్ని ఎంచుకుందని దుయ్యబట్టారు. ఈ ప్రక్రియను.. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజల అభిప్రాయపడుతున్నారని గుర్తు చేశారు.బాధితుల ఆందోళనలు, మేధావుల ఆలోచనలను పరిగణనలోనికి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దీనికి ఓ స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం కాకపోతే.. వీటిపై చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ముఖ్యంగా.. పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలన్నారు.


GHMC పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇండ్లకు ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు ఖర్చుచేసి వేసిన రోడ్లు, వెలిగించిన వీధి లైట్లు, కల్పించిన తాగునీటి వసతులు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, చివరకు GHMC తరపున ఇంటి నెంబరును కేటాయించిన విషయం వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏల ద్వారా సేవలు అందిస్తూ పన్నులు తీసుకుంటున్నప్పుడు అక్రమం అనిపించిందని నిలదీశారు. హఠాత్తుగా అక్రమం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలి? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని.. ప్లాట్లు, అపార్టుమెంట్లు కొనుక్కున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని కూడా నేలమట్టం చేయటం బాధాకరమన్నారు.


ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితి, పారదర్శకత, మానవత్వం, సామాజిక బాధ్యత, నిర్మాణాత్మక నియమ నిబంధనలు ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతంలో 15 వేలకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలున్నాయి. వారి నివాసాలను హైడ్రా ద్వారా కూల్చేముందు.. వారితో చర్చించాలని కేంద్ర మంత్రి సూచించారు. పాలకులు, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా ప్లాట్లుగా చేసి మధ్య దళారీల ద్వారా అమ్మారన్నారు. పేదలు జీవితమంతా సంపాదించిన సొమ్ముతో నిర్మించుకున్న ఇండ్లను కూల్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయం.. అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని కేంద్ర కిషన్ రెడ్డి ఆకాంక్షించారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa