తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోన్న సంగతి తెలిసిందే. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. ఈనెల 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉండగా.. సర్వే కోసం 87,092 ఎన్యుమరేటర్లను నియమించి సర్వే చేస్తున్నారు.
అయితే ఈ సర్వేకు ప్రజల నుంచి సరైన స్పందన రావటం లేదు. కొన్ని అంశాల్లో ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎన్యుమరేటర్లను ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. తమ వివరాలు మీకెందు చెప్పాలని నిలదీస్తున్నారు. బ్యాంకు అకౌంట్, ఆధార్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలని నిలదీస్తున్నారు. తమ వివరాలు ఇస్తే వాటిని గోప్యంగా ఉంచుతారనే నమ్మకం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి సర్దిచెప్పలేక ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చాలా మంది తమ వ్యక్తిగత వివరాలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. కొన్ని చోట్ల తమ ఆస్తులు, అప్పుల విషయాలు వెల్లడిస్తే పథకాలు రావనే అపోహ ప్రజల్లో నెలకొని ఉంది.
ఈ నేపథ్యంలో ప్రజల అపోహలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని చెప్పారు. ఎన్యుమరేటర్లు సేకరించే సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉండదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే పేద వర్గాల నుంచి మాత్రం కుల గణన సర్వేకు విశేష స్పందన కనిపిస్తోంది. పల్లెటూళ్లలో చాలా మంది సర్వే సిబ్బందికి సహకరిస్తున్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎన్యుమరేటర్లు అడిగి వివరాలు పూర్తిగా ఇచ్చేస్తున్నారు. పట్టణాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచార గోప్యతపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు.