హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. వచ్చే 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్- 2050 సిద్ధం చేస్తున్నట్టు సీఎంవో వెల్లడించింది. రోజురోజుకు నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా.. మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఫ్యూచర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సర్కార్ అన్ని రకాలుగా కసరత్తు చేస్తున్నట్టు సీఎంఓ పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 07వ తేదీతో సంవత్సరం పూర్తవతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలపై సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్‌లో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రూ.2232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, రూ.1,580 కోట్లతో నాగ్‌పుర్ నేషనల్ హైవేపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారని సీఎంవో పేర్కొంది. ముఖ్యంగా మెహిదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ పర్మిషన్ తెప్పించడం పెద్ద విజయంగా సీఎంవో తెలిపింది.
ఇదే క్రమంలో.. రూ.24,237 కోట్లతో మెట్రో రెండో దశ పనులకు కేబినెట్ ఆమోదం తెలపటంతో పాటు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి కూడా పంపించినట్టు.. త్వరలోనే పనులు కూడా ప్రారంభించుకోనున్నట్టు సీఎంవో తెలిపింది. మరోవైపు.. నగరం చుట్టూ రూ.18 వేల కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలిపింది. హెచ్‌సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.8,996 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి రూ.596 కోట్ల అంచనాలతో వరదనీటి కాల్వలను, కూడళ్లలో వర్షపు నీరు నిలవకుండా భూగర్భబావులను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఇక.. కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొంది. ఇక.. రూ.360 కోట్లతో మీరాలం చెరువు వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు సీఎంఓ ప్రకటించింది.
ఇవన్నింటితో పాటు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా.. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు కంకణం కట్టుకుందని సీఎంఓ తెలిపంది. ఫార్మాసిటీతో పాటు ఏఐ నగరం, సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ టెక్నాలజీ వంటి అధునాతన టెక్నాలజీ పరిశ్రమల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దబోతున్నట్టు వివరించింది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసింది. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా నెలకొల్పబోతున్నట్టు ప్రకటనలో సీఎంఓ వివరించింది.
అంతేకాకుండా.. హైదరాబాద్ మహానగర పరిధిలోని చెరువులు, నాళాలు, గవర్నమెంట్ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసినట్టు సీఎంఓ పేర్కొంది. ఇదే క్రమంలో.. హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తోన్న మూసీ నదికి పునరుజ్జీవం తీసుకొచ్చి.. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మూసీతో పాటు నగరంలోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పుకొచ్చారు.
మూసీలో చేరుతున్న మురుగును పూర్తిగా శుభ్రం చేసేందుకు ఇప్పటికే ఉన్నవాటితో పాటు కొత్తగా 39 ఎస్‌టీపీలను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎంఓ ప్రకటించింది. ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి.. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాలన్న ఆలోచనతో ప్రభుత్వం భారీ ప్రణాళికలు చేస్తోందని తెలిపింది. కాగా.. బాపూఘాట్‌ను మరింత అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దటమే కాకుండా.. గాంధీ ఐడియాలజీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని సీఎంవో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa