ఓ యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణం బలితీసుకుంది. మితిమీరిన వేగంతో కారు నడిపి, వేగంగా బైకును ఢీ కొనడంతో బైక్ వెనుక సీట్లో కూర్చున్న బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం ఎస్‌ఐ ప్రణయ్ తేజ్ వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన నర్సయ్య, పూజ దంపతుల రెండో కుమార్తె ఐరేని శివాని (21) గండిపేట్‌లోని సీబీఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. గండిపేట్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. నిజామాబాద్ నిజాంసాగర్‌లో తాను పదో తరగతి చదివిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అదివారం ఉదయం 4.30 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరింది. స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరింది. అదే రోజు రాత్రి 12 గంటలకు కూకట్‌పల్లిలో బస్సు దిగి హాస్టల్‌కు వెళ్లేందుకు తన స్నేహితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకట్‌రెడ్డి (26)ని పిలిచింది. వీరిద్దరూ బైక్‌పై బయల్దేరారు. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నానక్‌రాంగూడ రోటరీ నుంచి నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో సర్వీస్ రోడ్డులో బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు వీరి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో శివాని, వెంకట్‌రెడ్డి బైక్‌పై నుంచి ఎగిరి కిందపడ్డారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే శివాని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రగాయాల పాలైన వెంకట్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మదీనాగూడకు తరలించారు. కారు నిర్లక్ష్యంగా నడిపిన సాయికైలాష్ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుని కుమారుడిగా గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, స్కోడా కారును స్వాదీనం చేసుకున్నారు. చదువులో చురుగ్గా ఉండే శివాని ఇటీవల ప్రాంగణ నియామకాల్లో ఎంపికైంది. మరో నాలుగు నెలల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలో అనుకోని ప్రమదం ఆమె ప్రాణాలను హరించింది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.