ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులకోసం.... హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:22 PM

జమ్మూ కశ్మీర్‌లో పహల్గాం వద్ద ఈ నెల 22న జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని కుదిపేసింది. పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 26 మంది మృతిచెందారు. ఈ ఘటన తరువాత అక్కడ హై అలర్ట్ ప్రకటించడంతో, ఇప్పటికే అక్కడికి చేరుకున్న పర్యాటకులు తిరిగిరాని పరిస్థితిలో చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి శ్రీనగర్‌కు వెళ్లిన పర్యటకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయినట్లు తెలిసింది. తాము ప్రస్తుతం హోటల్‌లోనే ఉన్నామని, బయటకు వెళ్లే పరిస్థితి లేదని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తమను హైదరాబాద్‌కు సురక్షితంగా తరలించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.


అక్కడ చిక్కుకున్న వారిలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన 20 మంది, వరంగల్‌ నుంచి 10 మంది, మహబూబ్‌నగర్‌ నుంచి 15 మంది, సంగారెడ్డి నుంచి 10 మంది పర్యటకులు ఉన్నారు. అలాగే మెదక్‌ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా ఈ హోటల్‌లోనే ఉన్నట్లు సమాచారం. వీరంతా మంగళవారం జమ్మూ కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి, ఉగ్రదాడి తర్వాత పరిస్థితి అప్రమత్తతగా మారడంతో శ్రీనగర్‌లోనే చిక్కుకుపోయారు. అక్కడ ప్రధాన రహదారులు క్లౌడ్ బరస్ట్ కారణంగా ధ్వంసమవ్వడం, మంచు తీవ్రమైన దారుణంగా కురుస్తుండటంతో పర్యాటకుల తరలింపు కష్టతరంగా మారింది. ఈ పరిణామాలతో వేలాది మంది టూరిస్టులు తమ పర్యటనలు రద్దు చేసుకొని సురక్షితంగా వెళ్లిపోవాలని భావిస్తున్నా, రవాణా సదుపాయాల అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌లో చిక్కుకున్న పర్యాటకుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ టూరిస్టుల రక్షణ కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. వారి సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం కొనసాగుతోందన్నారు. అలాగే, జమ్మూ కశ్మీర్‌కు పర్యటనకు వెళ్లిన వ్యక్తుల వివరాలను వెంటనే అందించాలని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్‌లో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ల 94408 16071, 90106 59333, 040 - 23450368కు కాల్ చేసి సహాయం పొందవచ్చని మంత్రి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa