ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూకట్‌పల్లిలో ఒక బార్‌లో కల్తీ మద్యం కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 07:47 PM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక బార్‌లో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. చౌక రకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో నింపి అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు లక్షల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్‌లో కల్తీ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించడం.. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.


కల్తీ అనే పదం వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. తినే తిండి నుంచి మొదలుకొని పసిపిల్లల ఆహారం వరకు ప్రతిదీ కల్తీమయమైపోతోంది. కళ్లెదుటే కల్తీ జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సామాన్యులు బతుకుతున్నారు. అసలే రోజురోజుకూ ఆయుష్షు తగ్గిపోతున్న ఈ కాలంలో.. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం వ్యవహారం మరింత భయాన్ని కలిగిస్తోంది.


కొన్ని రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో నకిలీ బీర్లు అమ్ముతున్నారనే ఆరోపణలు మరువకముందే.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ బార్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదు.. అంతేకాకుండా లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేదు. దీంతో రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్.. ఎక్సైజ్ సిబ్బంది బార్‌ను తనిఖీ చేయడానికి వెళ్లారు.


తనిఖీ సమయంలో.. కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ.. పునిక్ పట్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి, వాటిలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలుపుతూ ఉండగా పట్టుబడ్డారు. వారు రూ. 2690 ధర కలిగిన జెమ్‌సన్ బాటిల్‌లో రూ. 1000 ధర కలిగిన ఓక్స్‌మిత్ మద్యాన్ని కలుపుతుండగా అధికారులు గుర్తించారు. బార్‌లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది.. ఎక్కువ బాటిళ్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపిన 75 బాటిల్లను.. 55 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కల్తీ మద్యం విలువ సుమారు రూ. 1.48 లక్షలు ఉంటుందని అంచనా.


గత కొంతకాలంగా ఈ బార్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదు. దీనికి తోడు మద్యం డిపోల నుండి మద్యం తీసుకోవడం లేదనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు. విచారణలో బార్ లైసెన్స్ ఓనర్ , మేనేజర్.. బార్‌లో పనిచేసే ఉద్యోగి ఇతర మద్యం దుకాణాల్లో తక్కువ ధర కలిగిన మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి.. వాటిని ఎక్కువ ధర కలిగిన ఖాళీ బాటిళ్లలో కలిపి అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్నారని తేలింది. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.


హైదరాబాద్ నగరంలో కల్తీ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఆహార పదార్థాల దగ్గర నుంచి పానీయాల వరకు ప్రతి దాంట్లో కల్తీ జరుగుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కల్తీ చేసే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కల్తీ మరింత ఎక్కువవుతోంది. ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కేవలం డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో కొందరు కల్తీకి పాల్పడుతున్నారు.


మద్యంలో కల్తీ జరుగుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం తాగే అలవాటు ఉన్నవారు తమకు తెలియకుండానే కల్తీ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల కిడ్నీలు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ కల్తీ దందాను అరికట్టడానికి అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తరచూ తనిఖీలు నిర్వహించడం.. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa