ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఆర్టీసీ అధికారులు గోదావరిఖని నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించారు. జూన్ 9న ప్రారంభమైన ఈ బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. జూన్ 11న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు ఈ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుణాచలం టూర్, గిరి ప్రదక్షిణ అంశాలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం సందర్శించాల్సిందే అని చెప్పారు. దీంతో గత కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి కూడా అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసు కల్పిస్తూ.. ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
కరీంనగర్ జిల్లా వాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జిల్లా నుంచి అరుణాచలం వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీస్‌ను తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ ఈడీ తెలిపారు. గోదావరిఖని నుంచి అరుణాచలానికి రాజధాని బస్ సర్వీస్ ప్రారంభం అవుతుందని.. భక్తులు దీన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ప్రత్యేక బస్సును ప్రారంభించారు.
గోదావరిఖని నుంచి మూడు రోజుల పాటు సాగే ఈప్రయాణానికి పెద్దలకు రూ.5,900, పిల్లలకు రూ.4900 ఛార్జీ వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారికి ఈ బస్సు సౌకర్యం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
సాధారణ రోజులతో పోలిస్తే.. పౌర్ణమి నాడు అరుణాచలంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ నెలలో రాబోయే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. జూన్ 11న వచ్చే పౌర్ణమి.. జ్యేష్ఠ పౌర్ణమి. కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి విశిష్టత దీనికే ఉంది. ఇక జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అలాంటి ప్రత్యేకత కలిగిన రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే కరీంనగర్ ఆర్టీసీ అధికారులు గోదావరిఖని నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు. కనుక భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
మిగతారోజులతో పోలిస్తే.. కార్తీక పౌర్ణమి సందర్బంగా అరుణాచలానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది టీఎస్ఆర్టీసీ.. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్,వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటుగా మరికొన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa