ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు బలమైన శక్తిగా వెలుగొందిన జలగం ఫ్యామిలీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చిన్న కుమారుడు జలగం వెంకట్రావుకు కాలం కలిసి రావడం లేదనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటములతో పాటు, న్యాయపోరాటాల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆయనకు వరుస నిరాశలు ఎదురవుతున్నాయి.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఈ వారసత్వంతో ఆయన పెద్ద కుమారుడు జలగం ప్రసాదరావు సత్తుపల్లి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, చిన్న కుమారుడు జలగం వెంకట్రావు 2004లో సత్తుపల్లి నుంచి, 2014లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) గెలిచిన ఏకైక స్థానం కొత్తగూడెం కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో జలగం వెంకట్రావు కాంగ్రెస్ సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావుపై గెలిచి సంచలనం సృష్టించారు.
నియోజకవర్గం మార్పు..
సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకప్పుడు జలగం ఫ్యామిలీ, తుమ్మల నాగేశ్వరరావు మధ్య బలమైన రాజకీయ పోరు ఉండేది. అయితే 2009లో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారడంతో జలగం, తుమ్మల వేరే నియోజకవర్గాలకు మారాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే జలగం వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి సారించారు.
హైకోర్టులో విజయం.. సుప్రీం స్టే..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకట్రావు ఓడిపోగా, వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే, 2019లో వనమా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో, వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేశారు. 2023 జూలైలో తెలంగాణ హైకోర్టు వనమాను అనర్హుడిగా ప్రకటించి, జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని తీర్పునిచ్చింది. ఈ పరిణామం అప్పట్లో కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారుతుందేమో అనిపించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు 2023 ఆగస్టు 7న హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో జలగం వెంకట్రావుకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం తృటిలో చేజారిపోయింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ కేసుపై దృష్టి మళ్లింది.
మరో న్యాయపోరాటం
వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో జైలుకు వెళ్లడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వనమా ప్రతిష్ట మసకబారింది. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం వనమాకే టికెట్ ఇచ్చింది. దీంతో జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీని వీడి ఫార్వార్డ్ బ్లాక్ నుండి పోటీ చేయగా, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు బరిలోకి దిగారు.
ఈ ఎన్నికల్లో కూనంనేని గెలుపొందగా, జలగం రెండో స్థానంలో, వనమా మూడో స్థానంలో నిలిచారు. అయితే, కూనంనేని ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయని జలగం గుర్తించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయన అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో, జలగం అనుచరుడిగా భావిస్తున్న నందూలాల్ అగర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కూనంనేని తన భార్య పేరును అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఆరోపించారు. అయితే, తాజాగా ఈ కేసులో హైకోర్టు కూనంనేనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో న్యాయపోరాటం ద్వారా మూడోసారి ఎమ్మెల్యే కావాలన్న జలగం వెంకట్రావు కల మరోసారి నెరవేరలేదు.
జనాల్లో చర్చ..
వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయి, న్యాయస్థానాల్లోనూ ఆశించిన ఊరట లభించకపోవడం పట్ల కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచాక జలగం వెంకట్రావు ప్రజలకు పెద్దగా అందుబాటులో లేకపోవడం వల్లే తదుపరి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఉంటే న్యాయపోరాటాలు లేకుండానే జనం ఓట్లతోనే గెలిచేవారని కొందరు నేతలు బాహాటంగానే అంటున్నారు. మరి ఇప్పటికైనా జలగం వెంకట్రావు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటారేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa