ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మా టికెట్ రేట్లు తక్కువే.. పాప్‌కార్న్ కూడా చీపే’ – PVR ఎండీ స్పష్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 09:13 PM

మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడటం ఇప్పుడు సామాన్యుడికి ఖరీదైన వ్యవహారంగా మారింది. టికెట్ రేట్ల సంగతి పక్కనపెడితే, లోపల విక్రయించే స్నాక్స్ ధరలు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.అయితే PVR–ఐనాక్స్ ఎండీ అజయ్ బిజిలీ మాత్రం తమ ధరలు ఏమాత్రం ఎక్కువ కాదని స్పష్టం చేశారు. తమ మల్టీప్లెక్స్‌లలో సగటు టికెట్ ధర కేవలం రూ.259 మాత్రమేనని, పాప్‌కార్న్ ధరలు రూ.159 నుంచే ప్రారంభమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.ఎండీ చెప్పిన లెక్కలు కాగితాలపై బాగానే కనిపిస్తున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకుల అనుభవానికి మాత్రం అవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. రూ.259 అనేది కేవలం యావరేజ్ మాత్రమేనని, ఇందులో టైర్-2 నగరాల రేట్లు, రూ.99 ఆఫర్లు వంటి వాటిని కూడా కలిపి లెక్క వేస్తారని వారు వాదిస్తున్నారు. మెట్రో నగరాల్లో, ప్రైమ్ లొకేషన్లలో వీకెండ్ సినిమా చూడాలంటే టికెట్ ధరలు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటున్నాయని, ఎండీ చెప్పిన రేట్లకు ఎక్కడా టికెట్లు దొరకడం లేదని విమర్శలు చేస్తున్నారు.టికెట్ ధరల కంటే అసలు సమస్య ఫుడ్ దగ్గరే ఎక్కువగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. బయట 10 రూపాయల ఖర్చుతో దొరికే మొక్కజొన్నను లోపల రూ.159కి అమ్మడం ఎంతవరకు న్యాయమని ఓ యూజర్ ప్రశ్నించారు. అది కూడా కేవలం స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనని, సాధారణంగా కొనుగోలు చేసే కాంబోలు రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటున్నాయని చెబుతున్నారు. బయట నుంచి తిండి తీసుకెళ్లనివ్వరు, లోపల మాత్రం అధిక ధరలు వసూలు చేస్తారని, ఇది ఒక రకమైన మోనోపోలీలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్తే పరిస్థితి ఏంటని మరో నెటిజన్ ప్రశ్నించారు. కుటుంబంలో నలుగురు సభ్యులు థియేటర్‌కు వెళ్తే టికెట్లు, స్నాక్స్ అన్నీ కలిపి కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు ఖర్చవుతోందని లెక్కలు చెబుతున్నారు. కేవలం పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసమే టికెట్ ధరలకు సమానంగా ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యులు తరచుగా థియేటర్లకు వెళ్లలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ కారణంగానే ఇటీవల కాలంలో భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలకే థియేటర్లు నిండుతున్నాయని, చిన్న మరియు మిడిల్ రేంజ్ సినిమాలను ప్రేక్షకులు ఓటీటీలోనే చూడటానికి ఇష్టపడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. థియేటర్ యాజమాన్యాలు చెబుతున్న ‘సగటు’ లెక్కలకు, ప్రేక్షకుడి జేబుకు పడుతున్న ఖర్చుకు పొంతన కుదరడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి PVR ఎండీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.159కి పాప్‌కార్న్ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పాలంటూ సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్ ధరలు తగ్గించకుండా, టికెట్ రేట్లు తక్కువే అంటూ చెప్పడం సరైనదికాదని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa