డిప్లొమా కోర్సు అనేది వృత్తిపరమైన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అనేక విశ్వవిద్యాలయాలు అందించే స్వల్పకాలిక కోర్సు. టెన్త్, ఇంటర్ చదివిన ఎవరైనా డిప్లొమా కోర్సును ఎంచుకోవచ్చు. అయితే డిప్లొమా కోర్సుల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? 2023లో భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్-10 డిప్లొమా కోర్సులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ఈ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి లేదు. అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టులతో 35% మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. ఎక్కువ మంది ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్ ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. MSU బరోడా, IIT మద్రాస్, LPU జలంధర్, VJTI ముంబై, JMI న్యూఢిల్లీ వంటి కొన్ని టాప్ కళాశాలల్లో ఇంజనీరింగ్ లో డిప్లొమా కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత, వారి ఆప్టిట్యూడ్ ను బట్టి కోర్ లేదా సంబంధిత పరిశ్రమలో సులభంగా ఉద్యోగం పొందవచ్చు.
2.హోటల్ మేనేజ్‌మెంట్ లో డిప్లొమా
ఈ కోర్సు చేయడానికి గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఏదైనా స్ట్రీమ్ లో 10+2 పరీక్షలలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ డిప్లొమా కోర్సు యొక్క 2 నుండి 3 సంవత్సరాలలో పూర్తవుతుంది. ADTU గౌహతి, అమిటీ యూనివర్సిటీ కోల్‌కతా, YMCA ఢిల్లీ, అపెక్స్ యూనివర్శిటీ జైపూర్, సుందర్‌దీప్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఘజియాబాద్ వంటి అనేక ప్రముఖ భారతీయ కళాశాలలు హోటల్ మేనేజ్‌మెంట్ లో డిప్లొమా కోర్స్ లను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేసిన వారు విదేశాల్లోని గౌరవనీయమైన 5-స్టార్ హోటళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా కళాశాలలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి.
3. కంప్యూటర్ మరియు ప్రోగ్రామింగ్ కోర్సులలో డిప్లొమా
టెన్త్ లేదా ఇంటర్ పాసై, సర్టిఫికేట్ ఉన్న విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సులో డిప్లొమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థి కనీసం ప్రాథమిక కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ మరియు ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కొన్ని ప్రోగ్రామింగ్, కోడింగ్ నైపుణ్యాన్ని ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు, నెట్‌వర్కింగ్, హార్డ్‌వేర్ గురించి కూడా నేర్చుకోవచ్చు. LPU ఫగ్వారా, JMI న్యూఢిల్లీ, CV రామన్ గ్లోబల్ యూనివర్శిటీ భువనేశ్వర్ వంటి కాలేజీలు ఈ కోర్సు అందిస్తున్నాయి.
4. నర్సింగ్ డిప్లొమా ప్రోగ్రామ్
నర్సింగ్ డిప్లొమా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 40% మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ప్రాథమిక భాషగా ఆంగ్లం ఉండాలి. ఒక ప్రొఫెషనల్ నర్సు కావడానికి BSc, MSc కోర్సులు చేయవలసిన అవసరం లేదు. నర్సింగ్ డిప్లొమా సులభంగా చేయవచ్చు. AMU అలీఘర్, SRM చెన్నై, MJRPU జైపూర్, IIMT యూనివర్శిటీ మీరట్ తో సహా భారతదేశంలోని అనేక ఉన్నత వైద్య కళాశాలలు నర్సింగ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
5. ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా
ఈ కోర్సును అభ్యసించడానికి కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో 10 + 2 పరీక్షను పూర్తి చేసి ఉండాలి. గణిత శాస్త్ర పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కానీ తప్పనిసరి కాదు. ఈ కోర్సు నిర్మాణ ఆలోచనలు, వ్యూహాలు, సాంకేతికతలను రూపొందించడానికి వారి కళాత్మక సామర్థ్యాలను ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది. JD ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బెంగళూరు, DIA నోయిడా, AMU అలీఘర్, ముంబై విశ్వవిద్యాలయం, GIMS డెహ్రాడూన్ వంటి ప్రముఖ భారతీయ కళాశాలల్లో ఇంటీరియర్ డిజైన్ డిప్లొమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డిప్లొమాను పొందిన వారికి అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
6. డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ
ఈ కోర్సు చేయాలంటే 12వ తరగతి పరీక్ష పాసై ఉండాలి. అగ్నిమాపక భద్రత, దాని వెనుక ఉన్న సాంకేతికత, నైతికత గురించి బోధిస్తుంది. దానికి సంబంధించిన సేఫ్టీ టెక్నిక్‌లను కూడా నేర్చుకోవచ్చు. IIT ఖరగ్‌పూర్, DIAT పూణే, RTMNU నాగ్‌పూర్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డెహ్రాడూన్ వంటి అగ్ర కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ డిప్లొమాతో విదేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేయడానికి కొన్ని ఆకర్షణీయమైన అవకాశాలను పొందవచ్చు.
7. ఎయిర్ హోస్టెస్ లేదా స్టీవార్డెస్ డిప్లొమా కోర్సులు
ఈ కోర్సు చేయాలంటే అభ్యర్థి ఏదైనా స్ట్రీమ్‌లో 12వ తరగతి పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. వయసు 17 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే అభ్యర్థి కనీసం 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉండాలి. ప్రయాణీకులు విమానాలు ఎక్కేటప్పుడు వారికి ఎలా సహాయం చేయాలో, సామాను మరియు సీటింగ్‌కు సంబంధించిన సమస్యలలో వారికి సహాయం చేయడం ఎలాగో నేర్చుకుంటారు. భద్రతా విధానాలను వివరించడం, ప్రయాణికులు వాటికి కట్టుబడి ఉండేలా చూసుకోవడం వంటివి కూడా నేర్పిస్తారు.
8. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా
అభ్యర్థి 12వ తరగతి (ఏదైనా స్ట్రీమ్‌లో)/గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ స్థాయిలలో కనీసం 50% నుండి 60% మార్కులను కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ డిప్లొమాను ఎంచుకోవడం వలన వృత్తిపరమైన ప్రదేశంలో మీకు అవసరమైన నైపుణ్యాలు మరియు మంచి ఉద్యోగ అవకాశాలను అందించవచ్చు.
9. యానిమేషన్ మరియు మల్టీమీడియాలో డిప్లొమా
ఈ కోర్సు చేయాలంటే ఏదైనా సబ్జెక్ట్ లేదా స్ట్రీమ్‌లో 12వ తరగతి పాసై ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో ప్రవేశించాలనుకుంటున్న విద్యార్థులకు ఈ డిప్లొమా ఉత్తమ ఎంపిక. ఈ డిప్లొమా కోర్సులో, కంప్యూటర్ యానిమేషన్ మరియు మల్టీమీడియా యొక్క కోర్ మరియు బేసిక్స్ గురించి తెలుసుకోవచ్చు. IIT బాంబే, VIT వెల్లూర్, ఫెర్గూసన్ కాలేజ్ పూణె, SJC బెంగళూరు, MAHE మణిపాల్, లయోలా కాలేజ్ చెన్నై వంటి అగ్రశ్రేణి కళాశాలల్లో ఈ కోర్సు కోసం నమోదు చేసుకోవచ్చు.
ఈ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ప్రొడక్షన్ టీమ్‌లో భాగమయ్యే అవకాశం పొందవచ్చు. సినిమాలు తీయవచ్చు. విదేశాల్లోని యూనివర్సిటీల నుంచి డిప్లొమా పొందడం వల్ల కొత్త అవకాశాలను పొందవచ్చు.
10. జిమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్లొమా కోర్సు
ఏదైనా స్ట్రీమ్ లేదా సబ్జెక్ట్‌లో గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతిలో కనీస మొత్తం స్కోర్ 50% నుండి 60% ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సులో వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. అభ్యర్థి వివిధ ఆరోగ్య సమస్యల గురించి మరియు నిర్దిష్ట వ్యాయామాలు ఆ పరిస్థితులను మెరుగుపరచడంలో ఎలా సహాయపడతాయో కూడా తెలుసుకుంటారు. జిమ్‌కు వెళ్లేవారు పెరగడంతో ఈ కోర్సుకు ఆదరణ పెరిగింది.