శరీరంలోని పేగుల్లో చేరిన నులిపురుగులకు ఒక్క అల్బెండజోల్ మాత్రతో చెక్ పెట్టవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల్లో ఎక్కువగా నులిపురుగులు ఉంటాయి. నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసం, కడుపులోనొప్పి కలగడమే కాకుండా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయే అవకాశం ఉంది. నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు మింగించేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నులిపురుగులతో నష్టాలు
నులిపురుగులు పేగుల్లోని రక్తాన్ని తాగి తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఫలితంగా రక్తహీనత వస్తుంది. నీరసించి పోతుంటారు. దగ్గు, ఆయాసం రావచ్చు. విద్యార్థి చదువులో ఏకాగ్రత కోల్పోతాడు. బిడ్డ ఎదుగుదల తగ్గిపోతుంది. చర్మంపై ఎర్రని దద్దులు రావచ్చు. బరువు తగ్గిపోతారు. తరచూ కడుపునొప్పి వస్తూ ఉంటుంది. వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం పడడం, తలనొప్పి, ఆకలి తగ్గిపోవడం జరుగుతాయి.
నివారణ చర్యలు
భోజనానికి ముందు, ఆటలు ఆడిన తరువాత, మలవిసర్జన తరువాత సబ్బుతో 2 నిముషాలు చేతులు శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 400 మి. గ్రా. మాత్ర ఒక్కటి నోటిలో చప్పరించాలి. లేదా నమిలి మింగాలి. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ఈ మాత్రలు ఇస్తారు.