ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ గర్భాన్ని ఇలా కూడా పోస్ట్ పోన్ చేయోచ్చు...దీనికి ఉంది ఓ మార్గం

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:41 PM

అవాంఛిత గర్భం మహిళలకు ఒక పెద్ద సమస్య. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనకుండా వాయిదా వేసుకోవాలని భావించే వారికి, బిడ్డకు బిడ్డకు మధ్య తగిన ఎడం ఉండేందుకు మహిళలలు అనేక గర్భ నిరోధక సాధనాలను వాడుతుంటారు. అవి ఫలితాలను ఇస్తాయో, ఇవ్వవో అనే భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు కొన్ని సాధనాలతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. అలాంటి వారందరికీ గొప్ప శుభవార్త ఇది. గర్భనిరోధ పద్ధతుల్లో కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. తేలికపాటి సూది మాదిరిగా ఉండే ఈ సన్నటి సాధనాన్ని  మహిళలు తమ మోచేతి చర్మం కింద పైపొరలో అమర్చుకుంటే చాలు. ఒక్కసారి అమర్చుకుంటే మూడేళ్ల వరకూ గర్భం దాల్చకుండా రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, ఒకవేళ వద్దనుకుంటే ఈ సాధనాన్ని ఎప్పడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే సులువుగా తీసేయవచ్చు. ఈ సాధనం తొలగించుకున్న 48 గంటల వ్యవధిలోనే గర్భం దాల్చేందుకు వీలు కలుగుతుంది.


కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ప్రయోగాల్లో ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చింది. ఏడాది కాలంగా కొంత మంది మహిళలల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ ఇంప్లాంట్‌ని ఉపయోగించే ప్రతి 100 మంది మహిళల్లో ఒకరి కంటే తక్కువగా వైఫల్యం రేటు ఉందని పరిశోధనలో పాల్గొన్న వైద్యురాళ్లు తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న గర్భనిరోధక విధానాల్లో ఉన్న ఇబ్బందులన్నింటినీ ఈ కొత్త విధానంతో అధిగమించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గర్భనిరోధానికి కండోమ్‌తో పాటు నోటి ద్వారా వేసుకునే మాత్రలు, ఇంజెక్షన్లు, కాపర్‌-టి లాంటివి వాడుతున్నారు. ఈ కొత్త సాధనాన్ని అమర్చేందుకు స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు.


3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు, 2 నుంచి 4 మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ సాధనాన్ని మహిళల మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీన్ని ఇంజెక్షన్ ఇచ్చిన మాదిరిగానే చర్మంలోకి చొప్పిస్తారు. ఆ తర్వాత దీని నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ సాధనమే ఆ హార్మోన్‌తో తయారు చేసింది కావడం విశేషం. ఈ హార్మోన్ మహిళ అండాశయం నుంచి అండం ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. ఇక మహిళలకూ ఎలాంటి సమస్య, భయం ఉండదు. బిడ్డల మధ్య దూరం ఉండాలని కోరుకునే భార్యాభర్తలకు కలయిక సమయంలో ఎలాంటి సంకోచం, అసౌకర్యం ఉండదు. ఈ విధానాన్ని ‘సబ్‌ డెర్మల్‌ కాంట్రాసెప్టివ్‌ ఇంప్లాంట్‌’ అని పిలుస్తున్నారు.


సిరంజితో ఇంజెక్షన్‌ను ఇచ్చినట్లే.. ఈ సాధనాన్ని మోచేతి వద్ద అమర్చేందుకు ప్రత్యేక సాధనం ఉంటుంది. కుడిచేతి వాటం వారికి ఎడమ చేతికి, ఎడమచేతి వాటం ఉన్నవారి కుడి చేతికి దీన్ని అమరుస్తారు. ఇది చాలా సులభం. నొప్పి కూడా స్వల్పం. దీన్ని అమర్చడం పెద్ద కష్టమైన పని కానప్పటికీ.. నర్సులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆస్పత్రుల్లో ప్రసవం జరిగిన వెంటనే ఈ సాధనాన్ని అమర్చొచ్చు. ఇతర గర్భనిరోధక సాధనాల విషయంలో మహిళలకు కనిపించే భయాలు ఈ విధానంలో ఉండవని డాక్లర్లు చెబుతున్నారు.


కెన్యాలో సుమారు 25 ఏళ్లుగా ఈ విధానం అమల్లో ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బృందం కొన్ని రోజుల కిందట కెన్యాలో పర్యటించి ఈ విధానాన్ని అధ్యయనం చేసి వచ్చింది. ఈ సాధనంతో దుష్ప్రభావాలు ఏవీ లేవని ఈ బృందం తెలిపింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బీహార్‌, డిల్లీ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి గర్భనిరోధ పద్ధతులను అవలంబించేవారు ఏటా 5 లక్షలపైనే ఉంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


కొత్త గర్భనిరోధకం అత్యంత ప్రభావవంతమైన వాటిలో ఒకటి అని వైద్య నిపుణులు తేల్చారు. అయితే, నిర్ధారణ చేయని యోని రక్తస్రావం ఉన్న స్త్రీలు, దిగువ అవయవాలు, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ సమస్య ఉన్న వాళ్లు, దృష్టిలోపంతో కూడిన మైగ్రేన్ ఉన్నవాళ్లు, రొమ్ము క్యాన్సర్ ఉన్న స్త్రీలలో ఈ సాధనాన్ని ఉపయోగించకూడదని వైద్యులు తెలిపారు. ఈ సాధనాన్ని మోచేతికి అమర్చుకునే వీలు ఉండటం వల్ల పెల్విక్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ముప్పు ఉండదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. ఎందుకంటే ఇది రుతుస్రావం సమయాల్లో రక్తస్రావాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com