వడదెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ విక్రమ్ నాయుడు పేర్కొన్నారు.అనంతపురం లో బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుతుండడం వలన ఆరుబయట ఆడుకోవడం, ఎండలో తిరగడం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. కావున విద్యార్థులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే చెప్పులు ధరించి, టోపి గాని రుమాలు ధరించి లేదా గొడుగు తీసుకుని వెళ్లాలన్నారు. పలుచటి నూలు దుస్తులు ధరించాలని, నల్లటి దుస్తులు ధరించారాదని తెలిపారు. ఎవరైనా ఎక్కువ సమయం నేరుగా ఎండలో పనిచేస్తే వడదెబ్బ సోకే ప్రమాదం ఉందని తలనొప్పి, తలతిరగడం, అధిక జ్వరం నీరసం, నాలుక ఎండిపోవడం మగతగా ఉండడం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు.