భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ ఫిబ్రవరి 3న కీలక ప్రకటన చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. ఈ సమయంలో ఏకీకృత ప్రాతిపదికన ఈ బ్యాంకు నికర లాభం ఏకంగా 35 శాతం పడిపోయింది. ఈసారి నికర లాభం రూ. 9163 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే సమయంలో నికర లాభం ఏకంగా రూ. 14,205 కోట్లుగా ఉంది. ఇప్పుడు నికర లాభం ఐదు బ్రోకరేజీ సంస్థల అంచనాల్ని అందుకోలేకపోయింది. అంచనా రూ. 13,525 కోట్లుగా ఉండగా.. అంతకంటే దాదాపు రూ. 4 వేల కోట్లు లాభం తక్కువగా వచ్చింది.
ఇక నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కం (NII- నికర వడ్డీ ఆదాయం) రూ. 39,815 కోట్లుగా ఉంది. ఇక్కడ కూడా అంచనాల్ని మిస్సయింది. అంచనా రూ. 40,304 కోట్లుగా ఉంది. ఇక బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (NPA) 2.42 శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 3.14 శాతంగా ఉండగా.. ఇప్పుడు 2.42 శాతానికి దిగొచ్చింది. ఇక నికర NPA గత త్రైమాసికానికి 0.64 శాతానికి చేరింది. అంతకుముందు త్రైమాసికంలో 0.77 శాతంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలు అంటే ఏప్రిల్- డిసెంబర్ వరకు బ్యాంక్ ఆదాయం రూ. 40,378 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలతో పోలిస్తే 20.40 శాతం పెరిగింది. అంతకుముందు ఇది రూ. 33,538 కోట్లుగా ఉంది. అన్ని సెగ్మెంట్లను చూస్తే బ్యాంక్ ఏడాది వ్యవధిలో చూస్తే 14.38 శాతం వృద్ధి కనబర్చింది. కార్పొరేట్ అడ్వాన్సులు రూ. 10 లక్షల కోట్లు దాటాయి. SME అడ్వాన్సులు రూ. 4 లక్షల కోట్లు దాటాయి.
ఎస్‌బీఐ షేరు విషయానికి వస్తే కిందటి రోజు 0.05 శాతం పెరిగి రూ. 648 వద్ద సెషన్ ముగించింది. కిందటి సెషన్‌లోనే రూ. 660.55 వద్ద ఇంట్రాడేలో 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక రూ. 501.55 కనిష్ట విలువ. ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 5.80 లక్షల కోట్లుగా ఉంది. గత 5 రోజుల వ్యవధిలో ఈ స్టాక్ దాదాపు 5 శాతం పెరిగింది. 6 నెలల్లో 13 శాతం పెరిగింది. ఏడాది కాలంలో దాదాపు 20 శాతం పుంజుకుంది. ఇతర బ్యాంకుల మాదిరిగానే.. ఎస్‌బీఐని కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్రం ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈక్విటీ వాటా విక్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు.