బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ- ఐఆర్‌డీఏఐ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజేషన్ చేయడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై బీమా కంపెనీలు అన్నీ ఎలక్ట్రానికి పద్ధతిలోనే పాలసీలను అందించాలి. లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్సులు సహా అన్ని పాలసీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఏప్రిల్ 1, 2024వ తేదీ నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. అసలు ఏంటీ ఇ-ఇన్సూరెన్స్, అకౌంట్ ఎలా తెరవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం? ఇ-బీమా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పాలసీదారుల సౌలభ్యం కోసం ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఐఆర్‌డీఏఐ. అలాగే పాలసీదారులు ఇప్పుడు తప్పనిసరిగా ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవడం ద్వారా తమ పాలసీలను డీమెటీరియలైజ్ చేయాలి. ఇది అన్ని జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా పాలసీల నిర్వహణను ఒకే చోట అనుమతిస్తుంది. ఆన్‌లైన్ ఖాతాలో బీమా పాలసీలను ఎలక్ట్రానికి రూపంలో భద్రపరుస్తారు. ఈ అకౌంట్ ద్వారా పాలసీదారులు బీమా ప్లాన్లను ఆన్‌లైన్‌లోనే యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇ-బీమా అకౌంట్ తెరవడం ఎలా?
మీరు ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవాలనుకుంటే ముందుగా సీఏఎంఎస్, కార్వి, ఎన్‌ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రెపోసిటరీ ఆఫ్ ఇండియా ల నుంచి ఈఐఏ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలు నమోదు చేయాలి. ఈ ఫామ్ తోపాటు కేవైసీ డాక్యుమెంట్లను జత చేసి గుర్తింపు పొందిన వ్యక్తి లేదా ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసు లేదా ఇన్సూరెన్స్ రిపోజిటరీ వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి.
అప్లికేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్దకు చేరిన తర్వాత దానిని వెరిఫై చేసి ప్రాసెస్ చేస్తారు. ఏడు రోజుల్లోగా ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది అందుబాటులోకి వస్తుంది. మరోవైపు.. ఇప్పటికే ఉన్న వాటికిని ఇ-పాలసీలుగా మార్చుకోవచ్చు. పాలసీదారుడి పేరు, పాలసీ నంబర్, ఇఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్, కంపేరు వంటివి పాలసీ మార్పిడి ఫారంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఇన్సూరెన్స్ ఓపెనింగ్ ఫారంతో పాటు ఇన్సూరెన్స్ బ్రాంచ్ లేదా ఆమోదిత వ్యక్తికి అందించాల్సి ఉంటుంది. మీ పాలసీ డిజిటల్ లోకి మార్చడం పూర్తయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ వస్తుంది. ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవడం, పాత పాలసీలను డిజిటలైజేషన్ చేయడం అనేది పూర్తిగా ఉచితం. అయితే, ఒకసారి పాలసీని కన్వర్ట్ చేసిన తర్వాత ఫిజికల్ పాలసీ సర్టిఫికేట్ ఇన్‌వాలిడ్ గా మారుతుంది.