ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24 సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మొదలైంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ సైతం అన్ని రకాల ఐటీఆర్ ఫామ్స్‌ని తొలి రోజు నుంచే అమదుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తొలి రోజు నుంచే చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అయితే, పన్ను చెల్లింపుదారుల్లో కొంత మంది మాత్రమే తొలినాళ్లలోనే ఫైల్ చేయగలరని, ఉద్యోగులు, ఎఫ్‌డీ ఇన్వెస్టర్ల వంటి పన్ను చెల్లింపుదారులు వేచి చూడాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు? మరి వారు ఈ ఏప్రిల్‌లోనే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చా? జులై 31 గడువు వరకు వేచి చూడాలా? అయితే ఎందుకోసం?
చాలా మంది ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఈ ఏప్రిల్ నెలలో తమ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోడవమే మంచిదని సూచిస్తున్నారు ట్యాక్స్ నిపుణులు. దానికి ప్రధాన కారణం మూలం వద్ద పన్ను మినహాయింపులుగా చెబుతున్నారు. శాలరీపై టీడీఎస్ కట్ అవుతుంటుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా బ్యాంకులు టీడీఎస్ కట్ చేస్తాయి. ఈ ప్రక్రియ అనేది ఏప్రిల్ 30 వరకు జరుగుతుంది. కంపెనీలు, బ్యాంకులు టీడీఎస్ వివరాలతో కూడిన ఫామ్ 16, టీడీఎస్ సర్టిఫికెట్లను మే 31 తర్వాతే విడుదల చేస్తాయి. జూన్ 15 లోపు ఫామ్ 16 జారీ చేస్తాయి. అందుకే వేతన జీవులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులు ఈ ఫామ్స్ లేకుండా ఐటీఆర్ ప్రాసెస్ మొదలు పెట్టడం మంచిది కాదు.
ఫామ్ 16 అనేది శాలరీపై కట్ చేసే టీడీఎస్ సర్టిఫికేట్. దీనిని కంపెనీ యాజమాన్యాలు జారీ చేస్తాయి. మీ టీడీఎస్ సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 16 వివరాలు సరిపోల్చుకోవడం ద్వారా ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవచ్చు. ఫామ్ 16 ఇవ్వకముందే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. కానీ, ఏదైనా తప్పులు దొర్లితే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి రావవచ్చు కూడా.
మరోవైపు.. తక్కువ సంఖ్యలోని ట్యాక్స్ పేయర్స్ మాత్రమే ఈ ఏప్రిల్ నెలలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. అందులో భారత్‌లో ప్రాపర్టీల విక్రయంతో వచ్చే క్యాపిటల్ గెయిన్స్ తప్పా ఎలాంటి ఇతర ఆదాయం లేని ఎన్ఆర్ఐలు ఉన్నారు. మరోవైపు.. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్, ఫామ్ 26 ఏఎస్ లో పూర్తి వివరాలు ఉండి ఇంకా ఎలాంటి వివరాలు రావాల్సిన అవసరం లేదనుకునే పన్ను చెల్లింపుదారులు సైతం ఈ కేటగిరీలోకి వస్తారు. ఏప్రిల్ నెలలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. త్వరగా తమ రిఫండ్ మనీ వచ్చేస్తుంది.