ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సరైన సమయం ఇదే. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్నులు దాఖలు చేశారు కూడా. ఐటీ రిటర్న్సులు ఫైల్ చేసిన తర్వాత ఐటీఆర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐటీ విభాగం మీ రిటర్నులను వెరిఫై చేసి ఆమోదిస్తుంది. ఈ క్రమంలో ఏవైనా లోపాలు ఉంటే, సరైన సమాచారం అందించకపోయినా మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి. అయితే, చాలా మంది ఐటీ నోటీసులు, సమాచార డిమాండ్లను పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకుంటారు. ఐటీ నోటీసులకు స్పందించకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇకపై ఐటీ శాఖ పూర్తి స్థాయిలో మీ రిటర్నులను తనిఖీ చేస్తుంది. తప్పులు ఉన్నట్లు తేలిదే మీపై చర్యలు తీసుకుంటుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ స్క్రూటినీ కోసం కేసుల ఎంపిక అంశంపై గతేడాదే కీలక మార్గదర్శకాలు జారీ చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ . ఐటీ నోటీసులకు స్పందించని వారి కేసులను తప్పసరిగా స్క్రూటినీ పరిధిలోకి తీసుకువస్తాని తెలిపింది. పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట డేటాను చట్టబద్ధ ఏజెన్సీలు, నియంత్రణ అధికారుల ద్వారా అందినప్పుడుసైతం తనిఖలు తప్పవుని తెలిపింది. సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయంలో వ్యత్యాసాలు ఉంటే పన్ను అధికారులు జూన్ 30 వ తేదీ లోగా ఐటీ చట్టంలోని సెక్షన్ 142 (1), 148 కింద నోటీసులు పంపుతారు. ఆ తర్వాత అసెస్సీ వాటికి చెందిన ధ్రువీకరణ పత్రాలను ఐటీ శాఖకు సమర్పించాలి. సెక్షన్ 142 (1) నోటీసులకు ఎలాంటి స్పందన రాకుంటే నేషనల్ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సెంటర్ చర్యలు చేపడుతుంది.
మరోవైపు.. రిటర్నులు ఎక్కడ ఫైల్ చేశారు, మరింత సమాచారం, లేదా మరిన్ని వివరాలు కోరుతూ ఐటీ యాక్ట్ 1961 లోని సెక్షన్ 142 (1) కింద నోటీసులు జారీ చేస్తారు అధికారులు. ఒక వేళ రిటర్నులు దాఖలు చేయకపోయినా ఐటీ నోటీసులు వస్తాయి. వాటికి నిర్ణీత పద్ధతిలో, నిర్ణీత సమయంలో అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మరోవైపు రద్దు చేసిన, ఉపసంహరించిన మినహాయింపులు, డిడక్షన్లు క్లెయిమ్ చేస్తున్న కేసుల వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఒక జాబితాలోకి చేరుస్తుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 143 (2) ప్రకారం నోటీసులు ఇస్తుంది. NaFAC ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఈ నోటీసులు వస్తాయి. వీటికి కచ్చితంగా స్పందించాలని, అడిగిన సమాచారం అందించాలని ఆదాయపు పన్ను నిపుణులు సూచిస్తున్నారు.