ఫ్రాన్స్ లో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ 2024లో మంగళవారం జరిగిన 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడీ భారత్ కు రెండో ఒలింపిక్ పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన మను,-సరబ్‌జోత్‌లు 16-10 తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించి షూటింగ్‌లో భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు. అంతకుముందు, మను భాకర్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది, అయితే పురుషుల ఈవెంట్‌లో పోటీపడుతున్న సరబ్జోత్ విజయం సాధించలేకపోయాడు. కానీ, మను-సరబ్‌జోత్‌ల జోడీ భారత్ కు రెండో మెడల్ ను అందించింది. ఈ క్రమంలోనే మను భాకర్ సింగ్ అనేక రికార్డులు సృష్టించారు. ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు గెలుచుకున్న స్వతంత్ర భారతదేశపు మొదటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
భారతీయ క్రీడలు కొన్ని సంవత్సరాలుగా భారత్ కు ఒలింపిక్స్ మెడల్స్ ను అందించాయి. కేడీ జాదవ్, మేజర్ ధ్యాన్ చంద్, కర్ణం మల్లీశ్వరి, అభినవ్ బింద్రా (మొదటి వ్యక్తిగత స్వర్ణ విజేత), సైనా నెహ్వాల్, సుశీల్ కుమార్, పీవీ సింధు, నీరజ్ చోప్రా, ఇంకా ఎందరో దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. అయితే, వారిలో ఎవరూ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఘనతను సాధించలేకపోయారు కానీ, మను భాకర్ పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ రెండు మెడల్స్ సాధించారు.