పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం.
సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంస్య పతకం కోసం జరిగే పోరుకు అర్హత సాధించింది. కొరియాకు చెందిన జూ లీ, వొన్హో లీతో మంగళవారం జరిగిన పోరులో 16-10 తేడాతో గెలిచిన మను, సరబ్జోత్ జోడీ.. భారత్‌కు రెండో పతకాన్ని అందించింది.
ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించిన మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వారిని అభినందించారు. మను, సరబ్జోత్ ఇద్దరూ గొప్ప నైపుణ్యాన్ని, టీమ్ వర్క్‌ను ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు. మనుకు ఇది వరుసగా రెండో ఒలింపిక్ పతకమన్న ప్రధాని.. ఆమె ఎంత అకింతభావంతో, నిలకడగా రాణిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.
మను భాకర్ రికార్డులు..
* 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సుమా శిరూర్ షూటింగ్ ఫైనల్ చేరగా.. ఆ తర్వాత షూటింగ్‌లో ఫైనల్ చేరిన తొలి భారత షూటర్‌గా మను భాకర్ రికార్డ్ క్రియేట్ చేసింది.
* ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కూడా మను భాకర్ కావడం విశేషం.
* దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ క్రీడల్లో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి ఇండియన్ కూడా మనునే.
* రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత షూటర్‌గా మను నిలిచింది.
* ఒలింపిక్స్‌లో టీమ్ మెడల్ సాధించిన తొలి భారత షూటింగ్ జోడీ మను, సరబ్జోత్ సింగ్.
* వ్యక్తిగత, టీమ్ విభాగంలో ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి ఇండియన్ మను భాకర్.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు వీరే..
మను భాకర్ కంటే ముందు సుశీల్ కుమార్, పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఇప్పుడు మను భాకర్ ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించి వీరి సరసన నిలిచింది.