పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం తెచ్చిపెట్టిన స్వప్నిల్ కుసాలేపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ షూటర్ ను అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా స్వప్నిల్ కు అభినందనలు తెలిపారు. ‘పారిస్ ఒలింపిక్స్ లో స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శన చేశాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో 3 స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు అతనికి అభినందనలు. మీ ఆటతీరు ఎంతో ప్రత్యేకం. ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మీరు. మీ విజయంలో ప్రతి భారతీయుడు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వప్నిల్ లకు కంగ్రాట్స్ తెలిపాడు. ‘మీరు భారత దేశానికి గర్వకారణం. పారిస్ ఒలింపిక్స్ లో 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో కాంస్య పతకాన్ని సాధించినందుకు స్వప్నిల్ కుసాలేకి అభినందనలు. మీ విజయం మరెంతో మంది ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మీరు భవిష్యత్ లో మరెన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు బండి సంజయ్.