హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. సిటీ నలమూలల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్న క్రమంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ ప్రాంతంలో చూసిన ఇల్లు, భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, ఒకప్పుడు హైటెక్ సిటీ, జూబ్లిహిల్స్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూము ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ధోరణి మారింది. నగర శివార్ల వైపు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నగరవాసులు తూర్పు ఈశాన్యంలో ఉన్న కాప్రా, ఈసీఐఎల్ వైపు చూస్తున్నారు. ఎందుకుంటే ఆ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అణు ఇంధన సంస్థ ఎన్ఎఫ్‌సీ, హిందుస్తాన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడంతో ఆ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
చర్లపల్లి, మల్లాపూర్, కుషాయిగూడ, నాచారం వంటి ప్రాంతాల్లో పారిశ్రామికవాడలతో విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బహుళ అంతస్తుల్లో ఫ్లాట్లు కొంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. షాపింగ్ మాళ్లు, కాలేజీలు, రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్లు సమీపంలోనే ఉండడమూ సానుకూలంగా మారింది. ఇక్కడ ఎక్కువగా ఏపీ ప్రజలు, ఉత్తర భారత ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ మార్కెట్ మంచి గిరాకీ ఏర్పడింది.
ఈ ప్రాంతంలో ఈసీఐఎల్- ఏఎస్‌రావునగర్- సైనిక్‌పురి ప్రధాన రహదారి, ఈసీఐఎల్- ఎస్పీనగర్- మౌలాలీ రేడియల్ రోడ్డు, ఈసీఐఎల్-కుషాయిగూడ-చక్రీపుర-కీసర రేడియల్ రోడ్డు వెంట స్థలాలు గజానికి రూ. 1 లక్ష నుంచి రూ. 2.50 లక్షల వరకు పలుకుతున్నాయి. కాప్రా, సైనిక్‌పురి, ఈశ్వరపురి, హైటెన్షన్‌లైన్, కుషాయికూడ, కమలానగర్, ఎస్పీనగర్, మౌలాలీ ప్రాంతాల్లో గజం రూ. 80 వేల నుంచి రూ. 1 లక్ష వరకు ఉంది. ఇక్కడ స్థలాల అందుబాటు ధరలో లేకపోవడంతో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ఫ్లాట్లు ఎస్ఎఫ్‌టీ రూ. 4 వేల నుంచి రూ. 7 వేల వరకు పలుకుతున్నాయి.
మంచి డిమాండ్ ఉన్న ఏరియా కావడంతో జనాల అభిరుచికి అనుగుణంగా ప్లాట్ల నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు బిల్డర్లు. ఆధునిక డిజైన్లు, యువతకు కావాల్సిన ఉడ్ వర్క్‌తో నిర్మిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కావాల్సిన సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నారు. బహుళ అంతస్తులకు నిలయంగా కాప్రా, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి ప్రాంతాలు గుర్తింపు పొందాయి. భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్న ఆ ప్రాంతంలో కొనుగోళ్లు ఏ మాత్రమం తగ్గకుండా జరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.