ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇటీవలి కాలంలో సరైన సమయానికి సర్వీసింగ్ సేవలు అందించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. పలువురు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షోరూమ్ సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సేల్స్, సర్వీస్ విభాగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సేల్స్ పెంచేందుకు ఇటీవలే కొత్త నెట్వర్క్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు సర్వీస్ నెట్వర్క్ విస్తరించేందుకు, మెరుగైన సర్వీసింగ్ సేవలు అందించేందుకు హైపర్ సర్వీస్ ఇనీషియేటివ్ ప్రారంభించింది. కస్టమర్లకు బెస్ట్ ఆఫ్టర్ సేల్ అనుభవాన్ని కలిగించే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా సర్వీస్ సెంటర్లను 2024, డిసెంబర్ నాటికి 1000కి పెంచాలని యోచిస్తోంది.
ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్. ' ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల కోసం ఇవాళ హైపర్ సర్వీస్ లాంచే చేస్తున్నాం.గత మూడేళ్లలో మేము 7 లక్షలకుపైగా కమ్యూనిటీని నిర్మించాం. దీంతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నాం. ఇప్పుడు మేము 800 స్టోర్లకు చేరుకుంటున్నాం. అయితే 500 సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ్టి నుంచి వాటిలో సైతం మార్పులు చేపడతాం. హైపర్ సర్వీస్‌తో మేము మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాము. ఆన్ డిమాండ్, ఏఐ పవర్ సర్వీస్‌తో క్లాస్ యాజమాన్యంలో అత్యుత్తమ అనుభావాన్ని రూపొందిస్తున్నాము. దేశంలో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా సర్వీస్ అందించేలా ఈ ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను 1000కి పెంచాలనుకుంటున్నాం' అని తెలిపారు భవీశ్ అగర్వాల్.
ఓలా ఈ నెట్వర్క్ ప్రార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా 1 లక్ష థర్డ్ పార్టీ మెకానిక్‌లకు ట్రైనింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈవీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దేశమంతటా ఎలక్ట్రిక్ వాహనాలకు సర్వీసు అందించేలో మెకానిక్‌లను సిద్ధం చేయనుందట. అలాగే 2024, అక్టోబర్ 10వ తేదీ నుంచి ఓలా కంపెనీ క్విక్ సర్వీస్‌కి గ్యారెంటీ ఇస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు సర్వీస్ సమయం ఒకరోజుకు మించినట్లయితే వారికి బ్యాకప్ ఓలా ఎస్1 స్కూటర్ అందజేయనున్నారు. ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉన్నట్లయితే వారికి సర్వీస్ రిక్వెస్ట్ పరిష్కారం అయ్యే వరకు ఓలా క్యాబ్ కూప్లను వాడుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. దీంతో తమ కస్టమర్లకు మెరుగైన సర్వీస్ సేవలు అందించాలని భావిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది.