నవరత్న హోదా కలిగిన పీఎస్‌యూ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. అదే రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టాక్. ఈ కంపెనీకి తాజాగా అదానీ కనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.134.46 కోట్లు విలువైన ఆర్డర్ లభించింది. అడ్వాన్స్డ్ స్మార్ట్ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కోసం ఈ ఆర్డర్ లభించినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 27, 2024 నుంచి సెప్టెంబర్ 26, 2034 వరకు నిర్ణీత ప్రదేశాల్లో స్మార్ట్ మీటర్లను బిగించాల్సి ఉంటుందని తెలిపింది. ఎనర్జీ మీటరింగ్ సదుపాయాలను ఆధునికీకరించడం, సమర్థవంతమైన ఇంధన నిర్వహణ, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ మీటర్లను బిగించనున్నట్లు తెలిపింది.
మరోవైపు.. రైల్‌టెల్ సంస్థకు వివిధ రంగాల నుంచి భారీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. మహారాష్ట్రలోని మంత్రాలయకు చెందిన రూరల్ డెవలప్మెంట్ విభాగం నుంచి రూ.155 కోట్లు విలువైన కాంట్రాక్ట్ లభించినట్లు వెల్లడించింది. కొంకణ్, పుణె, నాశిక్ ప్రాంతాల్లో ఏఎస్ఎస్‌కే-జీపీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నట్లు తెలిపింది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ టీపీఏ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచిరూ.48.7 కోట్లు విలువైన ఆర్డర్ సైతం పొందినట్లు తెలిపింది. అలాగే నార్తర్న్ రైల్వేస్ నుంచి రూ.10.92 కోట్లు, రూ.19.69 కోట్లు విలువైన రెండు ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.
రైల్‌టెల్ కంపెనీని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రకాల టెలికా సర్వీసులు బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్, డేటా సెంటర్ల వంటి సేవలు అందిస్తోంది. 6000 స్టేషన్లు, 61 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా 70 శాతం దేశ ప్రజలకు చేరువైంది. ప్రభుత్వం రంగంలో డెట్ ఫ్రీ టెలికాం కంపెనీకు నిలుస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.15 వేల కోట్లకుపైగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నెట్ సేల్స్ 24.1 శాతం పెరిగి రూ.467.61 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే నెట్ ప్రాఫిట్ 48.5 శాతం పెరిగి రూ.38.39 కోట్లుగా నమోదు చేసింది.
రైల్‌టెల్ కార్పొరేషన్ షేరు పని తీరు విషయానికి వస్తే.. గత శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే నాటికి 1.30 శాతం లాభంతో రూ.467.60 వద్ద స్థిరపడింది. గత నెల రోజుల్లో దాదాపు 5 శాతం నష్టపోయింది. అయితే, గడిచిన 6 నెలల్లో 20 శాతం లాభాలు అందించింది. ఈ ఏడాది 2024లో ఇప్పటి వరకు 33 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 108 శాతం లాభంతో ఇన్వెస్టర్ల సంపదను డబుల్ చేసింది. రూ.5 లక్షలు పెట్టిన వారికి రూ.10 లక్షలు వచ్చినట్లవుతుంది. ఇక గత ఐదేళ్లలో ఈ స్టాక్ 285 శాతం లాభాలు అందించింది.