తన తర్వాత టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్ట ముందే ఆ పదవికి అసలు మిస్త్రీ అర్హుడేనా అని రతన్ టాటా పునరాలోచన చేసినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది. రతన్ టాటా 2012, డిసెంబర్‌లో టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టేందుకు సైరస్ మిస్త్రీని ఎంపిక కమిటీ 2011లోనే ఎంపిక చేసింది. అయితే, ఆ ఏడాది కాలం పాటు భావి ఛైర్మన్ డిజిగ్నేట్‌గా మిస్త్రీ ఉన్నారు. ఆ సమయంలో కంపెనీని ఎలా నిర్వహించాలనే విషయంలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు, అనుభవాలు తెలుసుకునేందుకు రతన్ టాటా వద్ద అప్రెంటిస్‌షిప్ చేశారు మిస్త్రీ.
అయితే, ఈ ఏడాది చివరి నాటికి అసలు సైరస్ మిస్త్రీ ఈ పదవికి సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచనలో పడ్డారని రతన్ టాటా ఏ లైఫ్ పుస్తకంలో రాసుకొచ్చారు రచయిత. ఇటీవలే రతన్ టాటా అనారోగ్యంతో చికిత్స పొందుతూ దివంగతులైన సంగతి తెలిసిందే. థామస్ మాథ్యూ రతన్ టాటా జీవితపై ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కొల్లిన్స్ పబ్లిషర్స్ ప్రచురించింది. 2016 అక్టోబర్ లో టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించే నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా మిస్త్రీ కంటే రతన్ టాటాకే ఎక్కువ కష్టంగా అనిపించిందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా వ్యాఖ్యానించినట్లు పుస్తకంలో రాసుకొచ్చారు. అలాగే టాటా సన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ సైతం ఇదే తరహా విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. డైరెక్టర్ల నుంచి విశ్వాసం కోల్పోయినట్లు తెలిసినప్పుడు సైరస్ మిస్త్రీ హూందాగా ఆ బాధ్యతల నుంచి వైదొలిగి ఉంటే బాగుండేదని రతన్ టాటా భావించారని వెల్లడించారు.
సైరస్ మిస్త్రీ 2012 నుంచి 2016 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా కొనసాగారు. గ్రూప్ ఆరవ ఛైర్మన్. టాటా అనే ఇంటి పేరు లేని రెండో ఛైర్మన్‌గాను మిస్త్రీ గుర్తింపు పొందారు. అయితే, 2016, అక్టోబర్ నెలలో టా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ బోర్డు, మిస్త్రీని ఛైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు ఓటు వేసింది. ఆ తర్వాత రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా తిరిగి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత 2019, డిసెంబర్‌లో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ చంద్ర శేఖరన్‌ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. తిరిగి మిస్త్రీని పునరుద్ధరించింది. అయితే, సుప్రీం కోర్టు 2020, జనవరిలో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వుపై స్టే విధించింది. మిస్త్రీ కోర్టులో క్రాస్ అప్పీల్ దాఖలు చేశారు. అయిన ఆయన తొలగింపును సుప్రీం కోర్టు సమర్థించింది.