2004లో ఉత్తర్‌ప్రదేశ్‌లో తీసుకువచ్చిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు యాక్ట్ రాజ్యాంగ విరుద్ధం అంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టాన్ని రాజ్యాంగబద్ధమేనని తేల్చి చెప్పింది. మదర్సాల గుర్తింపును కాదనలేమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. అందులో సరైన సౌకర్యాలు ఉండాలని, విద్యను పరిరక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. మదర్సా చట్టాన్ని రూపొందించిన స్ఫూర్తి, పాలనలో ఎలాంటి లోపం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది.
యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అంజుమ్ ఖాద్రీ తదితరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లన్నింటిపై విచారణ జరిపి.. మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది. దీనిపై అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. మదర్సా చట్టాన్ని సమర్థిస్తూ.. సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. యూపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలు, మైనారిటీ హక్కుల పరిరక్షణను పాటించాలని పేర్కొంది.
ఇలాంటి నియంత్రణ మదర్సా వ్యవస్థను రద్దు చేయడం కంటే మద్దతు ఇవ్వాలని తెలిపింది. 2004 మదర్సా చట్టాన్ని రెగ్యులేటరీ చట్టంగా రాజ్యాంగబద్ధమైన విద్యాహక్కును కల్పించే ఆర్టికల్ 21ఏ నిబంధనలకు అనుగుణంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హితవు పలికింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం.. తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కులను మతపరమైన మైనారిటీలకు కల్పిస్తూనే.. మదర్సాలపై ప్రభుత్వ పర్యవేక్షణను కొనసాగించడానికి ఈ చట్టం ఉండాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. యూపీలోని 10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతోందని అప్పట్లో పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 16 వేల మదర్సాల కార్యకలాపాలు గతంలో లాగే యథావిధిగా కొనసాగనున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని.. అది రాజ్యాంగంలోని లౌకికవాద భావనకు విరుద్ధమైనదని గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు సందర్భంగా తెలిపింది. అయితే మదర్సాల నియంత్రణ జాతీయ ప్రయోజనాల కోసమేనని వెల్లడించింది. మైనారిటీల కోసం మదర్సాలను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని వందల ఏళ్ల ఉమ్మడి సంస్కృతిని నాశనం చేయలేమని పేర్కొంది. అంతేకాదు దేశంలో మతపరమైన విద్య ఎప్పుడూ శాపంగా మారలేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.