కారుకు అంత్యక్రియలు నిర్వహించడం మీరు ఎప్పుడైనా చూశారా. అదేంటి మనుషులు, జంతువులకు అంత్యక్రియలు చేయడం విన్నాం కానీ.. ఇలా ఓ మిషీన్ అయిన కారుకు అంత్యక్రియలు జరపడం ఏంటి అని షాక్ అవుతున్నారా. పైగా ఆ కారు ఏదో వారికి ఇష్టం లేనిదో లేక దురదృష్టం తీసుకువచ్చిందో కాదు. ఆ కుటుంబానికి ధనాన్ని సమకూర్చి పెట్టిన అదృష్ట కారు. అలాంటి కారును వారు లక్షలు ఖర్చు పెట్టి 1500 మందిని తీసుకువచ్చి మరీ పొలంలో పూడ్చి పెట్టి అంత్యక్రియలు చేశారు. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాధారణంగా మనుషులు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కుక్కలు, పిల్లులు సహా పెంపుడు జంతువులు కూడా చనిపోయినపుడు వాటిని ఇష్టంగా పెంచుకున్న వారు.. వాటికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటనలు కూడా మనం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ కారుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కారుకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ కుటుంబం ఏకంగా రూ.4 లక్షలు ఖర్చు పెట్టింది. ఇక ఈ అంత్యక్రియల కార్యక్రమానికి ఏకంగా 1500మంది హాజరయ్యారు. తమ కుటుంబానికి ఎంతో అదృష్టాన్ని తీసుకువచ్చిన ఆ కారును.. తమ పొలంలోనే ఆ కుటుంబం పూడ్చి పెట్టింది. ఈ సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పదార్‌శింగా గ్రామంలోని ఓ రైతు కుటుంబం.. తమకు అదృష్టాన్ని తీసుకువచ్చిన కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఈ తుది వీడ్కోలు కార్యక్రమానికి సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు సహా దాదాపు 1500 మంది హాజరు కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంజయ్ పోలారా అనే రైతు కుటుంబం.. రూ.4 లక్షలు ఖర్చు చేసి మరీ.. గురువారం (నవంబర్7) ఈ అంతిమ యాత్రను నిర్వహించింది. వారి ఇంటి నుంచి పొలం వరకు ఆ కారును ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆ కారుకు భారీగా పూలమాలలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.
ఆ తర్వాత 15 అడుగుల లోతు తవ్విన గొయ్యిలో.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ కారును పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా ఆ కారు యజమాని సంజయ్ పోలారా స్పందించారు. 12 ఏళ్ల క్రితం ఆ మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారును కొన్నానని.. ఈ కారు తన కుటుంబానికి అదృష్టంతో పాటు ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నాడు. అందుకే దాన్ని ఇతరులకు అమ్మడానికి బదులు.. అది తమ కుటుంబానికి చేసిన సేవలకు నివాళిగా తమ పొలంలోనే పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. ఇక ఆ కారు సమాధి మీద ఒక చెట్టును కూడా పెంచాలని అనుకుంటున్నట్లు సంజయ్ పోలారా వెల్లడించాడు.