కేరళలోని వామపక్ష ప్రభుత్వం.. ఇద్దరు ఐఏఎస్ అధికారులపై కొరడా ఝలిపించింది. క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడ్డారని ఆరోపిస్తూ ఐఏఎస్ కె.గోపాలకృష్ణన్, ఎన్.ప్రశాంత్ లపై సస్పెన్షన్ వేటు వేసింది. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినందుకు గోపాలకృష్ణన్, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ప్రశాంత్‌లపై సీఎం పినరయి విజయన్ సర్కారు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి శారద మురళీధరన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి విజయన్ ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
గోపాలకృష్ణన్ ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్‌గా కొనసాగుతుందగా.. ప్రశాంత్ వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణన్ ‘మల్లు హిందూ ఆఫీసర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను గత నెలలో క్రియేట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తాను ఆ గ్రూప్ క్రియేట్ చేయలేదని, ఫోన్ హ్యాక్ అయ్యిందని వాదించారు. కానీ, ఫోరెన్సిక్ విచారణలో అటువంటిది ఏమీ జరగలేదని గుర్తించారు. తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. మొబైల్ ‘రీసెట్’ చేయడంతో హ్యాక్ అయ్యిందా లేదా అనేది అస్పష్టంగా ఉందన్నారు.
ఇక, 2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఎన్ ప్రశాంత్.. అదనపు ప్రధాన కార్యదర్శి ఏ జయతిలక్‌పై ఫేస్‌బుక్‌లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీనియర్ అధికారి తనపై నిరాధారమైన వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలతో జయతిలక్ తనను అణగదొక్కే పనిలో ఉన్నారని ఆరోపించిన ప్రశాంత్.. ఆ సీనియర్ అధికారిని ‘సైకోపాత్’గా అభివర్ణించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం ఉద్దేశించిన 'ఉన్నతి' విభాగానికి ప్రశాంత్ సీఈఓగా పనిచేసిన సమయంలో అనేక ఫైళ్లు కనిపించకుండా పోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కోజికోడ్ జిల్లా కలెక్టర్‌గా.. ఇతర హోదాల్లో పనిచేసిన ప్రశాంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయనను ‘కలెక్టర్ బ్రో’ అని నెటిజన్లు పిలుచుకుంటారు.
మరోవైపు, సస్పెన్షన్ గురించి ప్రశాంత్ మాట్లాడుతూ.. తనపై చర్యలకు సంబంధించి ఎటువంటి నోటీసులు ఇంతకు వరకూ అందలేదన్నారు. ‘ఇది నాకో కొత్త అనుభవం.. ప్రభుత్వాలు లేదా వారి తప్పుడు విధానాలను విమర్శిస్తే చర్యలు తీసుకుంటారు.. అలాగని నేనేం చేశాను అనే అభిప్రాయం ఎవరికీ వస్తుందని అనుకోను. నిర్దిష్ట వ్యక్తుల అనుచిత ధోరణులు ముఖ్యంగా తప్పుడు కథనాలను లక్ష్యంగా చేసుకుని విమర్శించాను.. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నకిలీ నివేదికలను సృష్టించడం ప్రభుత్వ విధానం కాదని నేను విశ్వసిస్తున్నాను, కానీ అలాంటి చర్యలను విమర్శించడం పరిణామాలకు దారితీస్తే, అది నాకు వార్త’ అని వ్యాఖ్యానించారు. ‘దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛను కల్పించింది.. నా భావాలను వ్యక్తీకరించే హక్కు నాకుంది.. నాకు నా హద్దులేంటో తెలుసు.. నా పరిధిలో నేను ఉంటాను.. ఉత్తర్వులు వచ్చాక నా తదుపరి కార్యాచరణ ఉంటుంది’ అని అన్నారు.