రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి తీసుకొస్తున్న పోలీసులు, వారిని అక్రమంగా నిర్భంధించి వేధించడమే కాకుండా, ఒక్కొక్కరిపై ఐదారు అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్‌లతో వేర్వేరు జైళ్లకు తరలిస్తున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో నిర్బంధించిన సుధారాణి దంపతులను పరామర్శించడానికి వస్తే, తమ రాకకు కొద్ది గంటల ముందే వారిని పీటీ వారెంట్‌తో వేరే జైలుకు తరలించారని తెలిసిందని, ఈ విధంగా కొత్త తరహా వేధింపులకు పోలీసులు తెర తీశారని వారు ఆక్షేపించారు.
హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే తప్ప కార్యకర్తల ఆచూకీ చెప్పని పోలీసులు, వర్రా రవీంద్రారెడ్డిని సైతం సంధ్యారాణి మాదిరిగానే అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారని తెలిపారు. గుంటూరు జైల్లో ఉన్న వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, పానుగంటి చైతన్యను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని),ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు పరామర్శించారు.