అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న భార్యాభర్తలు.. దాన్ని బాల్కనీలోనే పెద్ద యవ్వారం మొదలుపెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడ మొక్కలు పెంచుతూనే తమ పని కానిచ్చేస్తున్నారు. ఇలా సాగిపోతున్న తరుణంలో భార్య.. ఫేస్‌బుక్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టింది. అయితే ఇవి వైరల్ కావడంతో వారిద్దరి గుట్టు బయటపడింది. ఇంతకీ బాల్కనీలో ఆ జంట ఏం చేస్తోంది. ఆ ఫోటోలు, వీడియోల్లో ఏం కనిపించింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసించే జంట చేసిన పని.. ఆ భార్య ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోల ద్వారా బయటపడింది. వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ బాల్కనీలో మొక్కలు పెంచుతున్నారు. పనిలో పనిగా ఆ చెట్లలోనే గంజాయి మొక్కలు కూడా సాగు చేశారు. ఎవరికీ తెలియకుండా, అనుమానం రాకుండా.. ఆ భార్యాభర్తలు సాగిస్తున్న యవ్వారం కాస్తా.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరికీ తెలిసిపోయింది. దీంతో అది కాస్తా పోలీసుల కంట పడటంతో రంగంలోకి దిగారు. వారిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
బెంగళూరులోని ఎంఎస్ఆర్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన జంట నివసిస్తున్నారు. కె.సాగర్ గురుంగ్(37), భార్య ఊర్మిళ కుమారి(38) అనే జంట ఆ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బాల్కనీలో గంజాయి సాగు ప్రారంభించారు. బాల్కనీలోని కుండీల్లో పూలు, షో చెట్లు పెంచుతున్న ఆ జంట పనిలో పనిగా గంజాయి మొక్కలను కూడా పెంచుతున్నారు. అయితే బాల్కనీలో గంజాయి మొక్కలు పెంచుతుండటంతో అది ఎవరికీ తెలియరాలేదు.
ఈ క్రమంలోనే ఇటీవల ఉర్మిళ తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో పాటు గంజాయి మొక్కల్ని చూపిస్తూ ఆమె ఫేస్‌బుక్‌లో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేసింది దీంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పలువురు వాటిని పోలీసులకు పంపించారు. దీంతో అది చూసిన పోలీసులు.. ఆ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వారి అడ్రస్ కనుగొన్నారు. ఈ క్రమంలోనే వారి బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీల్లో పెంచుతున్న గంజాయి మొక్కలను తీసిపారేయాలని చెప్పాడు. దీంతో వాళ్లు ఆ కుండీల్లో ఉన్న గంజాయి చెట్లను తొలగించినా.. పోలీసులు వచ్చి అందులోని ఆకులను గుర్తించారు.
ఈ క్రమంలోనే వారి వద్ద 54 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరపగా.. లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు వారిద్దరు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే వారు గంజాయిని విక్రయిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు పోలీసులు వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిద్దరినీ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.