ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370.. జస్టిస్ డీవై చంద్రచూడ్ టాప్-10 తీర్పులు ఇవే!

national |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 10:44 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ యశ్వంత్‌ చంద్రచూడ్ నవంబర్ 10వ తేదీన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తన చివరి వర్కింగ్ డేను నిర్వహించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. రేపటి నుంచి సుప్రీంకోర్టు నుంచి తీర్పులు ఇవ్వలేను అనేది నిజమని.. అయినా తాను తన వృత్తి పరంగా పూర్తిగా సంతృప్తి చెందినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ (వైవీ చంద్రచూడ్) కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయగా.. ఆయన వెలువరించిన కొన్ని తీర్పులను కూడా జస్టిస్ డీవై చంద్రచూడ్ తిరగరాయడం గమనార్హం.


2022 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్.. తన 2 ఏళ్ల పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులను వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, ఎలక్టోరల్ బాండ్స్ కేసు, డ్రైవింగ్ లైసెన్స్‌, బుల్డోజర్ కూల్చివేతలు, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి తీర్పులు ఇచ్చారు. నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్‌ హక్కు కేసుల్లో.. తీర్పులను వెలువరించారు.


ఎలక్టోరల్ బాండ్స్ కేసు


రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు, ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసే వారి మధ్య క్విడ్ ప్రోకో జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు.. వెంటనే ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు నిలిపివేయాలని తీర్పునిచ్చింది.


ప్రైవేటు ఆస్తుల స్వాధీనం


ఇటీవలె ప్రభుత్వాలు ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కాబోవని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.


ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే..


జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.


స్వలింగ వివాహాల చట్టబద్ధతకు నో చెప్పిన సుప్రీంకోర్టు


భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని కొట్టివేస్తూ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4 వేర్వేరు తీర్పులను ఇచ్చింది. ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ వారు సహజీవనంలో ఉండొచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపించవద్దని.. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


జైళ్లలో కుల వివక్ష


జైళ్లలో ఉండే ఖైదీల మధ్య కులవివక్ష చూపడం సరికాదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఇటీవలె పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో జైలు అధికారులు ఖైదీలతో ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలులో కులం ఆధారంగా ఖైదీల మధ్య వివక్ష, పని విభజన ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కులవివక్ష చూపడం సరికాదని వెల్లడించింది.


సెక్షన్‌ 6ఎ


పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యాంగ బద్ధమైనని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేష్, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజార్టీతో ఈ కేసులో తీర్పును ఇచ్చింది.


మదర్సాలు చట్టబద్ధమే


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పాటైన 16 వేలకు పైగా మదర్సాలు చట్టబద్ధమేనని ఇటీవలె సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మదర్సాలు లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మదర్సాల్లో చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు భారీ ఊరట లభించింది.


నీట్‌ వివాదం


దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నీట్‌ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా పేపర్ లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్‌ లీక్‌ అయిందని పేర్కొంది. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహిస్తే గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడుతుందని తెలిపింది.


ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసు


ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన తీర్పును వెలువరించారు. చట్టసభలో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది. చట్టసభల్లో డబ్బులు తీసుకుని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా వద్దా అన్న దానిపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని ఈ కేసు తీర్పు సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.


స్వలింగ వివాహాలపై సుప్రీం సంచలన తీర్పు..


బాల్య వివాహం


బాల్య వివాహాల నిషేద చట్టం-2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించారు. బాల్య వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఉల్లంఘించడం అవుతుందని వ్యాఖ్యానించారు. బాల్యవివాహాల నిరోధం, మైనర్‌ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని ఆదేశించారు.


అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం తీర్పు


ఇక తన పదవీకాలం చివరి రోజు అయిన శుక్రవారం(నవంబర్ 7)న కూడా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదా కల్పించడంపై కీలక తీర్పును వెలువరించింది. దీన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే ఆ యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉండాలా వద్దా అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది.


ఇక సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నవంబర్‌ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఇప్పటికే వెల్లడించారు. 2025 మే 13వ తేదీ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కొనసాగనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com