చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు..అదే చట్టం ముందు నిలబడక తప్పదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. వారితో ఆ పని చేయించిన నేతలెవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. సుధారాణి కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్ ఒక కేస్ స్టడీ అన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక నియంత పాలనలో ఉన్న దేశం కంటే, అధ్వాన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయని ఈ ప్రభుత్వం, చేతులెత్తేసి, దాన్నుంచి ప్రజలదృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మీడియాది. అది ప్రజాపక్షాన నిలబడి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడ మెయిన్‌స్ట్రీమ్ మీడియా చంద్రబాబుకు దాసోహం అయి, ఆయనకు రోజూ వంత పాడుతోంది.
దీంతో వాస్తవాలు ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న మీడియాను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా, కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఆ ఛానళ్లు ప్రసారం కాకుండా చూశారు. కానీ, ఒక్క సోషల్ మీడియా మాత్రం తన అదుపులో లేకపోవడంతో, కర్కషంగా వ్యవహరిస్తూ, దాన్నీ అణిచివేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎందుకంటే అది వ్యవస్థీకృత విధానంలో లేదు. సోషల్ మీడియా తనకు కొరగాని కొయ్యగా మారిందని భావిస్తున్న సీఎం చంద్రబాబు, టార్గెట్ చేసి, దారుణంగా వేధిస్తున్నారు.